
ఉగ్రం, నాసామి రంగ, జైలర్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న మిర్నా మీనన్.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె మరో ఆఫర్ అందుకుంది. నిర్మాత నాగవంశీ బావమరిది రుష్య హీరోగా పరిచయమవుతున్న ‘డాన్ బాస్కో’ చిత్రంలో హీరోయిన్‌గా మిర్నా మీనన్‌ను ఎంపిక చేసినట్టు శుక్రవారం ప్రకటించారు. లెక్చరర్ సుమతి పాత్రలో మిర్నా మీనన్ కనిపించనుందని రివీల్ చేశారు. తన పాత్ర సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని మేకర్స్ చెప్పారు.
పి.శంకర్ గౌరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ ప్రిన్సిపాల్ విశ్వనాథ్ పాత్రలో నటిస్తుండగా.. మౌనిక, రాజ్‌కుమార్ కసిరెడ్డి, విష్ణు ఓయ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని శైలేష్ రమ నిర్మిస్తున్నారు. ‘వెల్‌కమ్ టు ది క్లాస్ రీయూనియన్ - బ్యాచ్ 2014.. అన్ని రీ యూనియన్‌లు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటానికే కాదు..కొన్ని విమోచన గురించి కూడా’ అని ఈ చిత్రానికి క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తిని పెంచుతోంది. మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.