
- సినీ ఇండస్ట్రీకి ట్రంప్ టారిఫ్
- విదేశీ పోటీకి అడ్డుకట్ట వేసేందుకే సుంకాలు వేస్తున్నట్లు వెల్లడి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినీ రంగాన్ని కూడా వదల్లేదు. విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో షూట్ చేసుకుని రిలీజ్ అయ్యే సినిమాలకు మాత్రం టారిఫ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అమెరికా సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. చిన్న పిల్లల నుంచి క్యాండీని లాక్కున్నట్లు ఇతర దేశాలు తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని లాక్కున్నాయని ఆరోపించారు. బలహీనమైన, అసమర్థ గవర్నర్ గావిన్ న్యూసమ్ కారణంగా కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే అమెరికా బయట నిర్మించే అన్ని సినిమాలపై 100% టారిఫ్ విధిస్తామన్నారు. అయితే, ఎప్పటి నుంచి వర్తించేదీ ఆయన వెల్లడించలేదు.
మేక్ అమెరికా.. గ్రేట్ అగైన్కు కట్టుబడి ఉన్న
అమెరికా సినిమా రంగాన్ని రక్షించడానికి, విదేశీ పోటీని అడ్డుకోవడానికే 100% టారిఫ్ విధిస్తున్నామని ట్రంప్ తెలిపారు. ‘‘చాలా దేశాలకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్‌లు ఇవ్వడంతో అమెరికా సినిమా రంగం దెబ్బతిన్నది. ‘మేక్ అమెరికా.. గ్రేట్ అగైన్’కు కట్టుబడి పని చేస్తున్నాను. నాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం. ఇక్కడి వనరులను ఉపయోగించుకొని సినిమాలు తీస్తే.. టారిఫ్ నుంచి మినహాయింపు ఇస్తున్నాం. విదేశాల్లో షూట్ చేసుకుని.. ఇక్కడ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం 100% టారిఫ్ విధిస్తం’’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఫారిన్ బాక్సాఫీస్‌లో అమెరికా వాటే ఎక్కువ
ట్రంప్ ప్రకటించిన 100% టారిఫ్ కారణంగా, అమెరికాలో నడిచే బాలీవుడ్, తమిళ్, మలయాళం సినిమాల వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాలో సుమారు 52 లక్షల మందికి పైగా ఇండియన్లు నివాసం ఉంటున్నారు. ఫారిన్ బాక్సాఫీస్‌లో ఒక్క అమెరికా నుంచే 35 నుంచి 40 శాతం ఆదాయం వస్తుంది.
100% టారిఫ్ నిర్ణయంతో మన సినిమాలు అక్కడ విడుదల చేయడం కొంత కష్టం కావొచ్చని సినీ రంగ నిపుణులు అంటున్నారు. పెద్ద ఇన్వెస్టర్లు, ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు.. ఇకపై అమెరికా ఫిల్మ్ మార్కెట్‌లో ఆచితూచి వ్యవహరిస్తారు.
టాలీవుడ్ ఓవర్సీస్ సినిమా బిజినెస్‌పై ప్రభావం
తెలుగు సినిమాలపై కూడా పెద్దఎత్తున ప్రభావం పడనున్నది. పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలూ అమెరికాలో రిలీజ్ అయి కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఓవర్సీస్ సినిమా బిజినెస్‌తో మరీ ముఖ్యంగా అమెరికా వ్యాపారంతో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా లాభపడుతున్నది. ట్రంప్ నిర్ణయంతో ఈ లాభాలకు గండిపడినట్లు అవుతుంది.
అమెరికాలో 700–800 థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అలా విడుదలైన కల్కి, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాలు రూ.80 నుంచి రూ.160 కోట్ల వరకు రాబట్టుకున్నాయి. తెలుగు సినిమాలు అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్‌లోనూ చేరాయి. కాగా, అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయని అన్ని దేశాలపై భారీగా టారిఫ్ విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.
విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో షూట్ చేసుకుని రిలీజ్ అయ్యే సినిమాలకు మాత్రం టారిఫ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నిర్ణయంతో తెలుగు సినిమాలపై కూడా పెద్దఎత్తున ప్రభావం పడనున్నది. అమెరికాలో 700 - 800 థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. కల్కి, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాలు రూ.80 కోట్ల నుంచి 160 కోట్ల వరకు రాబట్టుకున్నాయి.