
- వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్
వాషింగ్టన్: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చైనా కోసం ఎంతోమంది అమెరికా సైనికులు ప్రాణత్యాగం చేశారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా విక్టరీ డే పరేడ్ సంబరాల నేపథ్యంలో తమ అమర వీరుల త్యాగాలను చైనీయులు గుర్తుచేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో విక్టరీ డే పరేడ్ లో పుతిన్, కిమ్ లతో జిన్ పింగ్ మాట్లాడుతున్న ఫొటోను ‘ట్రూత్ సోషల్’ లో షేర్ చేస్తూ.. జిన్ పింగ్ అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడని అన్నారు.
‘‘వరల్డ్ వార్ 2 లో చైనా స్వాతంత్ర్యం కోసం మా సైనికులు పోరాడారు. ప్రాణత్యాగం చేశారు. కానీ, ఇప్పుడు జిన్ పింగ్ మా దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు’’ అని ఆరోపించారు. పుతిన్, కిమ్ లకు అభినందనలు తెలపాలంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అమెరికా సైనికుల త్యాగాలను చైనా గుర్తిస్తుందా అన్న ప్రశ్నకు ట్రంప్ ఈ విధంగా స్పందించారు.
భారత్‌తో బిజినెస్ ఏకపక్షం
టారిఫ్‌ల వేళ భారత్‌తో సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో అమెరికా ఎప్పటినుంచో కలిసే ఉంటున్నదని, కానీ.. ఆ దేశమే తమపై భారీగా సుంకాలు విధిస్తున్నదని అన్నారు. ఓవెల్ కార్యాలయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. భారత్, అమెరికాల మధ్య దీర్ఘకాలంగా ఆర్థిక సంబంధాలన్నీ ఏకపక్షంగా ఉన్నాయని తెలిపారు. తాను అధికారం చేపట్టిన తర్వాత సంబంధాల్లో మార్పు వచ్చిందని వెల్లడించారు.
‘‘భారత్ తో వ్యాపార సంబంధాల విషయంలో మేం చాలా ఫూలిష్ గా వ్యవహరించాం. ఇటీవలి కాలం వరకూ ఆ దేశంపై ఎలాంటి సుంకాలు విధించలేదు. దీంతో భారత వస్తువులు అమెరికాను ముంచెత్తాయి. కానీ, అమెరికాపై ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధిస్తోంది. దీంతో భారత్ తో మేం వ్యాపారం చేయలేకపోయాం” అని వ్యాఖ్యానించారు. తాను భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను సమర్థించుకుంటూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.