ఇరాన్ బాధితులకు కాశ్మీర్ నుంచి విరాళాలు..థ్యాంక్యూ ఇండియా అంటూ ఇరాన్ ఎంబసీ ట్వీట్

ఇరాన్ బాధితులకు కాశ్మీర్ నుంచి విరాళాలు..థ్యాంక్యూ ఇండియా అంటూ ఇరాన్ ఎంబసీ ట్వీట్
  • క్యాష్​, బంగారం, వెండి నగలు,  పశువులు, రాగి వస్తువుల అందజేత

    
న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్ ప్రజలను ఆదుకునేందుకు కాశ్మీరీ ప్రజలు మానవతా దృక్పథంతో ముందుకొస్తున్నారు. కేవలం డబ్బులు మాత్రమే కాకుండా బంగారం, వెండి ఆభరణాలు, పశువులు, సంప్రదాయ రాగి వస్తువులను కూడా విరాళంగా అందిస్తున్నారు. కాశ్మీర్ ప్రజలు ఇరాన్ యుద్ధ బాధితుల కోసం చూపుతున్న ఈ మానవత్వం అందరి హృదయాలనూ కదిలిస్తున్నది. 

ఈ నేపథ్యంలో ‘మీ ప్రేమను ఎప్పటికీ మరువం’ అంటూ ఇరాన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బుద్గామ్, బారాముల్లా జిల్లాల్లో షియా- ఆధిపత్య ప్రాంతాలకు చెందిన వలంటీర్లు ఓ మానవతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈద్- ఉల్ -ఫితర్ వేడుకల తరువాత ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించారు. ఇందులో మహిళలు, పిల్లలె సహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. చాలా మంది మహిళలు తమ బంగారం, వెండి ఆభరణాలను, విలువైన గృహోపకరణాలను విరాళంగా ఇచ్చారు. ఓ కాశ్మీరీ వితంతువు తన భర్త జ్ఞాపకార్థం 28 ఏండ్లుగా భద్రపరిచిన బంగారు జ్ఞాపికను విరాళంగా ఇచ్చారు. 

కొంతమంది తమ పశువులను కూడా ఇచ్చారు. పిల్లలు తమ పొదుపు, ఈద్ డబ్బును ఇచ్చి ఇందులో పాలుపంచుకున్నారు. బుద్గాం ఎమ్మెల్యే ముంతాజిర్ మెహదీ తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఈ ఘటనపై భారత్​లోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. ఇరాన్ పునర్నిర్మాణం కోసం డబ్బు, ఆభరణాలను విరాళంగా ఇచ్చిన భారతీయుల ప్రేమ, మానవత్వానికి ధన్యవాదాలు తెలిపింది. 

విరాళాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్​ చేసింది. ‘‘తమ మానవతా సహాయం, హృదయపూర్వక సంఘీభావంతో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచిన కాశ్మీర్ ప్రజలకు మేము కృతజ్ఞతాపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రేమను మేం ఎప్పటికీ మరిచిపోము. థ్యాంక్యూ ఇండియా’’ అని రాయబార కార్యాలయం ఎక్స్​లో పోస్ట్​చేసింది.