యూటర్న్​ సీఎం కావొద్దు : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

యూటర్న్​ సీఎం కావొద్దు : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
  •   కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలె  

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వైరీ సాధ్యం కాదని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ఏజెన్సీలతో విచారణ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్​ అన్నారని, ఇప్పుడెందుకు యూటర్న్​ తీసుకుంటున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి మంచి నేతగా పేరుందని.. ఎంక్వైరీ విషయంలో యూటర్న్​ తీసుకుని యూటర్న్ సీఎం కావొద్దని హితవు చెప్పారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా ఏలేటి మాట్లాడారు.

 కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పీసీసీ చీఫ్​గా ఉన్నప్పుడు సీబీఐకి ఆధారాలు ఇస్తానన్న రేవంత్​ రెడ్డి.. ఇప్పుడెందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. వాళ్ల మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్​పార్టీలది గల్లీలో కొట్లాట.. ఢిల్లీలో దోస్తానా అని పొన్నం విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకూ బీఆర్​ఎస్​ మద్దతిచ్చిందని పేర్కొన్నారు. 

ఈడీ, సీబీఐలను వాడుకుని ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపడమే వాళ్లకు అలవాటని.. బీఆర్ఎస్ నేతలను మాత్రం టచ్ చేయడం లేదని అన్నారు. పొన్నం వ్యాఖ్యలకు మహేశ్వర్​ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీ లేదని గుర్తు చేశారు. సీబీఐ వచ్చేలా సీఎం రేవంత్​తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖ ఇప్పించాలని డిమాండ్​ చేశారు. సీఎం రేవంత్ ను యూటర్న్​ సీఎం అనొద్దని ఆది శ్రీనివాస్​హితవు చెప్పారు. ప్రాజెక్టుపై విజిలెన్స్ రిపోర్ట్​ను తయారు చేయించామన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్​కు అఖిలపక్ష ఎమ్మెల్యేలను తీసుకెళ్తే బీజేపీ ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు.

బీఆర్​ఎస్​తో బీజేపీ ఎన్నటికి కలవదు

మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంత గొంతు చించుకున్నా డిప్యూటీ సీఎం పదవి రాదని మహేశ్వర్ రెడ్డి అన్నారు. 52 శాతం ఉన్న బీసీలకు కేవలం రెండు మంత్రి పదవులే దక్కాయన్నారు. డిప్యూటీ సీఎంగా మొదటి నుంచి పొన్నం పేరు వినిపించిందని, మరి ఆయనకు ఎందుకు డిప్యూటీ సీఎం రాలేదోనని అన్నారు. బీఆర్ఎస్​తో బీజేపీ ఎన్నటికీ కలవబోదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టింది డొల్ల బడ్జెట్ అని ఆయన విమర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారన్నారు. బీసీలకు పదేండ్లలో రూ.లక్ష కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్​ పార్టీ.. బడ్జెట్​లో మాత్రం కేవలం రూ.8 వేల కోట్లే పెట్టిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేయాలని డిమాండ్​ చేశారు. మేడిగడ్డకు రాలేదని బీఆర్​ఎస్​, బీజేపీ ఒకటేనని సీఎం రేవంత్​ ఎలా అంటారని ప్రశ్నించారు.