డెలివరీ బాయ్స్ రూల్స్ బ్రేక్ చేయొద్దు

డెలివరీ బాయ్స్ రూల్స్ బ్రేక్ చేయొద్దు

హైదరాబాద్,వెలుగుసిటీ రోడ్లపై డ్రైవింగ్ చేసే డెలివరీ బాయ్స్ పై ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆర్డర్ డెలివరీ చేసేందుకు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారికి చెక్ పెట్టే్ందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా  ఫుడ్ డెలివరీ సంస్థల ప్రతినిధులతో ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ శనివారం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ లో  సమావేశమయ్యారు. డోర్ డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారంటూ సంస్థల ప్రతినిధులకు ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్  తెలిపారు.  డెలివరీ బాయ్స్ రూల్స్ బ్రేక్ చేయడం వల్ల  రోడ్డుపై ఇతర వాహనదారులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఫుడ్ డెలివరీ చేసే సమయంలో సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్,రాంగ్ రూట్ లో ర్యాష్ డ్రైవింగ్,సిగ్నల్ జంపింగ్ తో పాటు సరిగా లేని నంబరు ప్లేట్లను వాడుతున్నారని నిర్వాహకుల దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ఇలాంటి సమయాల్లో డెలివరీ బాయ్స్ తో పాటు రోడ్డుపై  వెళ్లే ఇతర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశముందన్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలు తమ దగ్గర పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ సంస్థ తమ సిబ్బందికి నిర్ధేశిత యూనిఫాంను కేటాయించాలన్నారు. తమ వద్ద పనిచేసే డెలిబరీ బాయ్స్ పూర్తి వివరాలను తెలుసుకోవాలని.. నిరంతరం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడంతో పాటు నేర ప్రవృత్తి ఉన్న వారిని తీసుకోవద్దని సంస్థ ప్రతినిధులతో ఆయన చెప్పారు. ట్రాఫిక్ పోలీసులతో కో ఆర్డినేట్ చేసుకుంటూ డెలివరీ బాయ్స్  ట్రాఫిక్ కేసుల డేటాను తెలుసుకోవాలన్నారు. డెలివరీ బాయ్స్ ను నియమించుకునే ముందు ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ లో కౌన్సిలింగ్ ఇప్పించాలని సంస్థల ప్రతినిధులకు ఆయన సూచించారు. ఫుడ్ డెలివరీ సంస్థల  ప్రతినిధుల నుంచి కూడా సలహాలు,సూచనలను ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ తీసుకున్నారు . ఈ సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ ఎల్.ఎస్ చౌహన్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.