జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుంటే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

జూనియర్ ఎన్టీఆర్  స్పందించకుంటే ఐ డోంట్ కేర్  : బాలకృష్ణ

హైదరాబాద్‌‌, వెలుగు: టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టుపై సినిమావాళ్లు స్పందించకపోతే పట్టించుకోనని టీడీపీ పొలిట్‌‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుంటే ఐ డోంట్ కేర్ అని కామెంట్ చేశారు. తాము కేసులు, అరెస్టులకు భయపడమని.. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. 

‘‘రోజా లాంటి వారి స్పందనపై మౌనంగా ఉండడమే మేలు. బురదలో రాయి వేస్తే మన మీదే పడుతుంది” అని అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌‌లో టీడీపీ నేతలతో బాలకృష్ణ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని, ఓట్ల కోసమే ఇక్కడ కొందరు తన తండ్రి ఎన్టీఆర్‌‌ జపం చేస్తున్నారని బాలకృష్ణ అన్నారు. ‘‘ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉంది. ఇప్పుడు మళ్లీ చైతన్యంలోకి వచ్చింది. తెలంగాణలో అంతా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఇక్కడి ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు టైమ్ వచ్చింది. తప్పకుండా టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. పొత్తులపై చంద్రబాబు నిర్ణయిస్తారు” అని చెప్పారు. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌‌లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అనడం సరికాదన్నారు. 

కేంద్రాన్ని కలుస్తాం..  

ఏపీలో ఒక సైకో పాలన చేస్తున్నాడని బాలకృష్ణ విమర్శించారు. ‘‘17ఏ సెక్షన్‌‌ పాటించకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేశారనేదే మా ప్రశ్న. ఈ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో తెలియదు. అనవసరంగా ఎవరిపైనా మేం నిందలు వేయం. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా మా అక్క పురందేశ్వరి ఉన్నారు. ఆమెతో టచ్‌‌లో ఉన్నాం. తప్పకుండా కేంద్రాన్ని ఈ విషయంపై కలుస్తాం” అని చెప్పారు. కాగా, సమావేశంలో చంద్రబాబు అరెస్టు, తెలంగాణ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించినట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.