టీఆర్ఎస్ పార్టీ నేతలను ముట్టుకుంటే మాడిపోతరు

టీఆర్ఎస్ పార్టీ నేతలను ముట్టుకుంటే మాడిపోతరు

మా జోలికి వస్తే రోడ్ల మీద తిరగకుండా చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.  ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించి బీజేపీ నేతలు దాడి చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవరిని ముట్టుకున్నా మాడిపోతారన్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులరా... ఇండ్లల్లో చెప్పి బయటకు రండని సత్యవతి రాథోడ్ నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న ఆమె... కేసీఆర్ కి భయపడి అక్రమంగా కేసులు పెడుతూ వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా ప్రజల దగ్గరికి వెళుతుందని చెప్పుకొచ్చారు.

ఉద్యమ నాయకుడి సారథ్యంలో తెలంగాణ  రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక బీజేపీ అక్రమ కేసులతో వేధించే ప్రయత్నం చేస్తున్నారని సత్యవతి రాథోడ్ ఆరోపణలు చేశారు. గతంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంను తీసుకెళ్లి ఢిల్లీ కాళ్ల కింద పెట్టారన్నారు. ఇప్పుడు బీజేవైఎం నేతలు ఇలా మహిళా నాయకురాలి ఇంటిపై దౌర్జన్యం చేయడం సరైన పద్ధతి కాదని వారించారు. కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టిన ఘనత బీజేపీదేనని సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎవరు మంచి పని చేస్తే వారిపై ఈడీ కేసులు పెడుతున్నారని ఆమె దుయ్యబట్టారు.