హెడ్​మాస్టర్​ను మార్చొద్దు.. స్టూడెంట్ల ఆందోళన

హెడ్​మాస్టర్​ను మార్చొద్దు..  స్టూడెంట్ల ఆందోళన

గూడూరు, వెలుగు: తమ హెడ్​మాస్టర్​ను మార్చొద్దంటూ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడులో గవర్నమెంట్​ స్కూల్​స్టూడెంట్లు మంగళవారం ఆందోళనకు దిగారు. వరుస సెలవులు రావడం, మంగళవారం హెడ్​మాస్టర్​పూల్​సింగ్ డ్యూటీకి రాకపోవడంతో పిల్లలు ఆందోళన చెందారు. ‘హెచ్ఎం ఇక రారు.. ట్రాన్స్​ఫర్ ​అయ్యారు’ అని టీచర్లు చెప్పడంతో క్లాసులు బాయికాట్ చేసి స్కూల్ ముందు నిరసనకు దిగారు. తమ హెడ్​మాస్టర్​ను మార్చొద్దంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి నచ్చజెప్పినా పిల్లలు వినలేదు. స్కూల్ కాంప్లెక్స్ హెడ్​మాస్టర్​కాంతారావు అక్కడికి చేరుకుని.. ప్రభుత్వ స్కూల్​లో ప్రైవేట్​వ్యక్తుల ప్రమేయం లేకుండా చూస్తామని, వారం రోజుల్లో అయిదుగురు రెగ్యులర్ టీచర్లను నియమిస్తామని, ప్రిన్సిపల్ పూల్​సింగ్​ఇక్కడే ఉంటారని హామీ ఇవ్వడంతో స్టూడెంట్లు ఆందోళన విరమించారు. 

స్టూడెంట్ల నుంచి పైసలు వసూలు

రెండు సంవత్సరాల కింద 200 మంది స్టూడెంట్లకు ఇద్దరు టీచర్లు, అరకొర వసతులతో నడుస్తున్న పొనుగోడు గవర్నమెంట్​స్కూల్ ను అభివృద్ధి చేస్తానని గ్రామంలోని వెంకన్న అనే వ్యక్తి దత్తత తీసుకున్నాడు. కాంట్రాక్ట్ పద్ధతిన14 మంది సిబ్బందిని ఏర్పాటు చేశాడు. దీంతో కొద్ది రోజుల్లోనే స్టూడెంట్ల సంఖ్య 550కు చేరింది. కాగా స్కూల్ డెవలప్ మెంట్ ఫండ్ పేరుతో వెంకన్న ఒక్కో స్టూడెంట్​నుంచి రూ.5 వేల నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

టై, బెల్టుల పేరుతో అదనంగా మరికొంత గుంజుతున్నారని వాపోతున్నారు. గత అకడమిక్ ఇయర్ చివరిలో ఇక్కడి ప్రిన్సిపల్ రజితను ఉన్నతాధికారులు సస్పెండ్​ చేయగా, ఆమె స్థానంలో వచ్చిన ప్రిన్సిపల్ పూల్ సింగ్  స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్​ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని స్టూడెంట్లు, తల్లిదండ్రులు చెబుతున్నారు. టీచింగ్​ విషయంలో సీరియస్​గా ఉంటున్న పూల్​సింగ్​ను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలని కాంట్రాక్ట్​ టీచర్లు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.