
న్యూఢిల్లీ: ఎన్నికల అనంతర పథకాల కోసం సర్వేల ముసుగులో ఓటర్ల వివరాలు తీసుకోవద్దని అన్ని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఎన్నికల సంఘం సూచించింది. ప్రకటనలు, సర్వేలు, యాప్ ల ద్వారా వ్యక్తుల వివరాలు నమోదు చేయడం లాంటి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని గురువారం లేఖలు రాసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రతిపాదిత పథకాల కోసం సర్వేల నెపంతో ఓటర్ల వివరాలను కోరడం ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం అక్రమమని ఈసీ పేర్కొంది. అటువంటి కార్యకలాపాలు క్విడ్ ప్రోకో కిందికి వస్తాయని, అవినీతికి దారితీసే అవకాశం ఉందని పేర్కొంది.
ఎన్నికల అనంతర లబ్ధి కోసం రిజిస్టర్ చేసుకోవాలని వ్యక్తిగతంగా ఓటర్లను ఆహ్వానించడం అనేది ఓటరు, అభ్యర్థి ఒకరితో ఒకరు లావాదేవీ సంబంధాన్ని కలిగి ఉండాలనే అభిప్రాయాన్ని సృష్టించవచ్చని, ఇది క్విడ్-ప్రోను రూపొందించే అవకాశం ఉందని కమిషన్ పేర్కొంది. ఈసీ ఆదేశాలు ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 123(1)తో పాటు లంచానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 171(B) ప్రకారం చర్యలు ఎదుర్కొంటారని పేర్కొంది.
అటువంటి ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. అంతకుముందు కాంగ్రెస్ ‘ఘర్ ఘర్ గ్యారంటీ’పై బీజేపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ ‘గ్యారంటీ కార్డులు’ పంపిణీ చేస్తున్నారని బీజేపీ పేర్కొంది. ఇలాంటి చర్యలు ఓటర్లను ప్రలోభానికి గురిచేసే అవకాశం ఉందని ఫిర్యాదు చేసింది.