
‘‘బీజేపీ మన దగ్గర బాగా పుంజుకుంటున్నది. మనం జాగ్రత్తగా ఉండాలి. లోక్‌సభ ఎన్నికల టైమ్‌లో ఆ పార్టీని ఈజీగా తీసుకొని తప్పు చేసినం. అది రిపీట్ కావొద్దు. మున్సిపల్ ఎలక్షన్‌లో అలర్ట్‌గా ఉండాలి. అయితే బీజేపీ గురించి అంతగా టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం జాగ్రత్తగా పని చేసుకుపోవాలి అంతే’’ అని టీఆర్ఎస్ నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై ఆయన గురువారం తెలంగాణభవన్‌లో సమీక్షించారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల ఇన్చార్జులు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ తాజా పరిస్థితిపై కూడా సమావేశంలో కేటీఆర్ చర్చించినట్లు తెలిసింది. టీఆర్ఎస్ వర్గాలు అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ నాయకులు రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు కాచుకు కూర్చున్నారని, అందులో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఆ విమర్శలను గ్రౌండ్ లెవల్ నుంచి బలంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్ నేతలకు సూచించారు.
మన తప్పిదాలతోనే బీజేపీకి ఆ 4 సీట్లు
లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ తప్పిదాలను ఈ సమావేశంలో కేటీఆర్ ప్రస్తావించారు. ‘‘మన తప్పిదాల వల్లే బీజేపీ నాలుగు సీట్లను సొంతం చేసుకుది’’ అని వివరిస్తూ మున్సిపల్ ఎన్నికలను మాత్రం ఈజీగా తీసుకోవద్దని సూచించినట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని, ఆ చాన్స్ ఇవ్వకుండా సీరియస్ గా వర్క్ చేయాలని టీఆర్ఎస్ నేతలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడనేది ఈ నెల 28న కోర్టు తీర్పుతో తేలిపోతుందని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీ ఆఫీసుల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దసరా నాటికి అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాలను పూర్తిచేయాలని, దసరా రోజున ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
సభ్యత్వాల్లో బీజేపీ కన్నా మనమే టాప్
రాష్ట్రంలో పార్టీ సభ్యత్వాల నమోదు విషయంలో బీజేపీ కన్నా టీఆర్ఎస్ టాప్ లో ఉందని, బీజేపీవాళ్లు కేవలం 12 లక్షల సభ్యత్వం చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని కేటీఆర్ విమర్శించినట్లు తెలిసింది. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు గడువు గురువారంతో ముగిసినా ఇంకా మెంబర్ షిప్ బుక్స్ కావాలంటూ చాలా నియోజకవర్గాల నుంచి డిమాండ్ వస్తోందని, అయితే ఇంకా ఎవరికి బుక్స్ ఇచ్చేది లేదని అన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ సభ్యత్వాలు 60 లక్షలు దాటాయని చెప్పారు. వచ్చే నెల మొదటివారం నుంచి నియోజక వర్గాల వారీగా పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. కొన్ని నియోజక వర్గాల్లో ప్యరటిస్తానని కూడా చెప్పారు.
మన పథకాలే గొప్పవి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాల కంటే గొప్పవని సమావేశంలో కేటీఆర్ అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద 75 లక్షల కుటుంబాలకు వైద్యం అందుతున్నదని, ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరితే ప్రజలకు నష్టమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలపై పార్టీ కేడర్‌కు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.
ఈ నెలాఖరుకల్లా పార్టీ కమిటీలు: పల్లా
ఇప్పటివరకు టీఆర్ఎస్ సభ్యత్వం 60 లక్షలు దాటిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అందులో 20 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలున్నారని, వారందరికీ త్వరలో గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. సభ్యత్వ నమోదుపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జరిపిన సమీక్ష వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఆగస్టు చివరినాటికి పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తామన్నారు. గ్రామ, మండల, పట్టణాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 51 శాతం అవకాశమిస్తామని తెలిపారు.
సభ్యత్వ నమోదులో సిరిసిల్ల వెనుకంజ
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో మొదటి 10 స్థానాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు. అందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకు చోటు దక్కలేదు. మొదటి స్థానంలో సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, 2వ స్థానంలో మేడ్చల్, 3వ స్థానంలో పాలకుర్తి, 4వ స్థానంలో ములుగు, 5వ స్థానంలో మహబూబాబాద్, 6వ స్థానంలో సత్తుపల్లి, 7వ స్థానంలో పాలేరు, 8వ స్థానంలో సూర్యాపేట, 9వ స్థానంలో సిద్దిపేట,10 స్థానంలో వర్దన్నపేట ఉన్నాయని పల్లా వివరించారు.