హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థ ద్వారానే కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఒక చేత్తో సింగరేణిని ప్రైవేట్ పరం చేయబోమంటూనే.. మరో వైపు బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే పనిలో కేంద్ర సర్కార్ ఉందని ఆయన మండిపడ్డారు. ఇది ఎన్డీయే సర్కార్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. దీనిపై ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడుతారని ఆయన చెప్పారు. సింగరేణి ఆధ్వర్యంలో అన్ని బొగ్గు నిక్షేప సంస్థలు లాభాల్లో ఉన్నాయని తెలిపారు. లాభాల్లో నడుస్తున్న సంస్థ సింగరేణి అని, కార్మి కుల నైపుణ్యం వల్లనే అది సాధ్యమవుతున్నదని చెప్పారు.
గురువారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వొద్దని, సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేటాయించాలన్నారు. సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై ఒకసారి పునరాలోచన చేసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోదని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో తమ సర్కార్ అలర్ట్‌గా ఉందని, లా అండ్ ఆర్డర్‌కు ఎవరు విఘాతం కలిగించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఏపీ నుంచి తాము నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలు తమకు పట్టం కట్టారని, తెలంగాణ ప్రజల ఆలోచన మేరకే తమ పాలన ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
