చలో కలెక్టరేట్​కు వెళ్లొద్దని దండోరా వేయించిన్రు

చలో కలెక్టరేట్​కు వెళ్లొద్దని దండోరా వేయించిన్రు
  • దండోరా వేయించిన శ్రీరాంపూర్​ పోలీసులు  
  • నాయకులు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు   

నస్పూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లోని సింగరేణి స్థలాల్లో ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలనే డిమాండ్​తో బుధవారం బీజేపీ తలపెట్టిన చలో కలెక్టరేట్​ ప్రోగ్రాంకు ఎవరూ వెళ్లవద్దని మంగళవారం రాత్రి పోలీసులు దండోరా వేయించారు. నిరసనలు, ఆందోళనలు చేపడితే అడ్డుకోవడమో, అరెస్ట్ చేయడమో చేసే పోలీసులు ఏకంగా బీజేపీ ప్రోగ్రాంకు వెళ్లవద్దని దండోరా వేయించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల తీరుపై పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు మండిపడ్డారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి స్థలాల్లో పేదలు ఏండ్లుగా నివాసముంటున్నారు. కాగా, సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకున్నవారికి ప్రభుత్వం పట్టాలు అందజేస్తోంది. 5వ వార్డు పరిధిలోని ఆర్కే6 ఏరియా, అంబేద్కర్ నగర్, హనుమాన్ నగర్, లక్ష్మీనగర్, రాజీవ్ నగర్, ఉదయ్ నగర్​లలో 500 కుటుంబాలు రేకుల షెడ్లు, గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. ఇతర ఏరియాల్లో ఉంటున్న కొంతమందికి ప్రభుత్వం పట్టాలిచ్చి 5వ వార్డు పరిధిలో ఇవ్వలేదు. వీరికి సైతం పట్టాలు ఇవ్వాలని బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం చలో కలెక్టరేట్​కు పిలుపునిచ్చారు. అయితే శ్రీరాంపూర్ పోలీసులు ప్రోగ్రాంకు ఎవరూ వెళ్లవద్దని మంగళవారం రాత్రి దండోరా వేయించారు. బీజేపీ లీడర్లను బుధవారం ఉదయమే అదుపులోకి తీసుకుని పీఎస్​కు తరలించారు. 
 

మీరు పట్టాలిప్పిస్తరా? 
తమ పార్టీ లీడర్లను అరెస్ట్​ చేశారన్న విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావు పోలీస్ స్టేషన్​కు వెళ్లి పోలీసులను నిలదీశారు. చలో కలెక్టరేట్​కు వెళ్లవద్దని దండోరా వేయించి ప్రజలను భయపెట్టే హక్కు ఎవరిచ్చారని సీఐ రాజు, ఎస్సై మానసలను ప్రశ్నించారు. పేదలకు మీరు పట్టాలు ఇప్పిస్తారా?  అని ప్రశ్నించారు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే దివాకర్​రావు ఆదేశాలతోనే ప్రజలను, బీజేపీ కార్యకర్తలను బెదిరించారని ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదన్నారు. నస్పూర్ టౌన్​ ప్రెసిడెంట్​అగల్​డ్యూటీ రాజు, రాష్ర్ట కార్యదర్శి పొనుగోటి రంగారావు, ఈర్ల సదానందం, మద్ది సుమన్, రావనవేని శ్రీనివాస్, తాడురి మహేశ్​ఉన్నారు. ఈ విషయమై ఎస్సై మానసను వివరణ కోరగా పోలీసులు దండోరా వేయించారని బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తమన్నారు.