కాల్వలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్​

కాల్వలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ, వెలుగు: గౌరవెల్లి కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. కాల్వలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని కోరారు. బుధవారం అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్​ మండలాల్లో కాంగ్రెస్​ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పీసీసీ అబ్జర్వర్​ పవన్​తో కలిసి పాల్గొని మీడియాతో మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ సత్తా చాటేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరైనా పార్టీలో చేరుతామ వస్తే..  వారితో పార్టీకి లాభం ఉంటేనే  చేర్చుకుంటామన్నారు.  హుస్నాబాద్​ నుంచి వయా అక్కన్నపేట, జనగామ హైవేకి ఫోర్​ వే వేయాలని కేంద్ర మంత్రి గట్కరీకి లేఖ రాస్తే స్పందించారన్నారు. ఏ సమస్య ఉన్న ఒక ఎస్ఎంఎస్ చేయాలని హైదరాబాద్​ వచ్చినా హుస్నాబాద్ ​వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

బీఆర్ఎస్​ పదేళ్ల పాలనలో 1240 ఇండ్లు శాంక్షన్​ ఇచ్చి 443 మాత్రమే లబ్దిదారులకు ఇచ్చారని విమర్శించారు. ఇందులో కేసీఆర్​ దత్తత తీసుకున్న ముల్కనూర్​ గ్రామానికి 240 ఇండ్లు ఇచ్చారన్నారు. కాంగ్రెస్​ పాలనలో మొదటి దశలోనే 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు.  సిద్దిపేట జిల్లాలోనే 45 వేల మందిని కొత్త రేషన్ కార్డుల్లో నమోదు చేశామన్నారు.  

అంతకుముందు మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ వర్ధంతిలో పాల్గొన్నారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ ​లింగమూర్తి, సింగిల్​విండో చైర్మన్​ శివ్వయ్య, ఏఎంసీ చైర్​పర్సన్​ నిర్మల, మండల అధ్యక్షుడు ధర్మయ్య, నాయకులు సుధాకర్, జగన్​రెడ్డి, రవీందర్, రాజయ్య, మల్లారెడ్డి, శ్రీధర్​ పాల్గొన్నారు.