మతిలేదా.. మందేసినవా? కేసీఆర్​ కామెంట్లపై రేవంత్​ ఫైర్​

మతిలేదా.. మందేసినవా? కేసీఆర్​ కామెంట్లపై రేవంత్​ ఫైర్​
  • అబద్ధాలతో కాంగ్రెస్​ను బద్నాం చేసేందుకు కుట్ర
  • ఉచిత కరెంట్ ​ఆలోచన, అమలు చేసిందే కాంగ్రెస్ 
  • అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటలూ ఫ్రీగా కరెంట్​ ఇస్తం
  • రైతు భరోసా స్కీం కింద ఎకరాకు రూ. 15 వేలు అందజేస్తం
  • ధరణి కంటే మంచి పోర్టల్​ తీసుకొస్తం
  • పేదల ఇండ్లకు 200 యూనిట్ల దాకా ఉచిత  విద్యుత్​ 
  • కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం
  • కేసీఆర్​ ఊరూరా బెల్టుషాపులు తెరిచిండు.. 
  • బడికిపోయే పిల్లలనూ తాగుడుకు అలవాటు చేసిండు
  • బీఆర్​ఎస్​ లీడర్లు నోట్లు, లిక్కర్​తో ఊర్లమీద పడ్డరు

మద్దూరు / కోస్గి, వెలుగు: కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్​, రైతు బంధు బందైతయన్న సీఎం కేసీఆర్​ కామెంట్లకు పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. ఉచిత కరెంట్​ ఆలోచనే కాంగ్రెస్​ది అని, వైఎస్​ రాజశేఖర్​రెడ్డి హయాంలోనే వ్యవసాయానికి ఉచిత కరెంట్​ ఇచ్చామని ఆయన తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటలూ ఫ్రీగా కరెంట్​ ఇస్తామని, రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేలు అందజేస్తామని  స్పష్టం చేశారు.

‘‘కాంగ్రెస్​ వస్తే రైతు బంధు, కరెంట్​ బందైతదని కేసీఆర్​ అంటున్నడు.. ఎందుకు బందైతది? కేసీఆర్​ మతిలేకుండా మాట్లాడుతున్నడో.. మందేసి మాట్లాడుతున్నడో తెల్వదు కానీ.. ఆయన మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.. రైతుల కష్టాలు తెలుసు కాబట్టే నాడు వైఎస్సార్​ సీఎంగా ఉన్నప్పుడు ఉచిత కరెంట్​ ఇచ్చి ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్​ది. అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 24 గంటలు ఉచిత విద్యుత్​ అందిస్తం. పేదల ఇండ్లకు 200 యూనిట్ల  వరకు ఫ్రీగా కరెంట్​ సరఫరా చేస్తం.

వాళ్ల బిల్లులను ‘గృహలక్ష్మి’ స్కీం కింద చెల్లిస్తం. రైతుబంధు పేరిట పండుగలకు ముందు కేసీఆర్​ పదివేలు ఇస్తుంటే.. అవి బెల్టు షాపులకు కట్టాల్సి వస్తున్నది. కానీ, కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే..  వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే ఎకరానికి రైతు భరోసా కింద 15వేలు ఇస్తది.  రైతు కూలీలకు కూడా ఏటా 12వేలు అందిస్తది” అని చెప్పారు. 

కాంగ్రెస్​ను బద్నాం చేసేందుకు కేసీఆర్​, ఆయన పార్టీ లీడర్లు ప్రయత్నిస్తున్నారని, అయినా ప్రజలు వాళ్లను నమ్మే పరిస్థితి లేదని రేవంత్​​అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి మండల కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన మాట్లాడారు. రైతులకు అండగా ఉండేది కాంగ్రెస్​ పార్టీ అని, వాళ్ల కష్టాలు తెలుసుకాబట్టే ఫ్రీ కరెంట్​ ఆలోచన చేసి, అమలు చేసింది కూడా కాంగ్రెస్​ పార్టీనేనని తెలిపారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే.. ఆడబిడ్డకు కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలే కాకుండా తులం బంగారం ఇస్తామని, ధరణి కంటే మెరుగైన సాంకేతికతతో పోర్టల్​ తెస్తామని ప్రకటించారు. 

12ఏండ్ల పిల్లగాడు కూడా  బీరుసీసాతో తిరుగుతున్నడు

2018లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు కొడంగల్​ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని కేసీఆర్​ చెప్పారని, రెండేండ్ల లోపల కృష్ణా జలాలు తీసుకొచ్చి, ఆ నీళ్లతో జనం కాళ్లు కడిగి, నెత్తిన చల్లుకుంటానని మాటిచ్చారని రేవంత్​ అన్నారు. ఎన్నికలు పోయి మళ్లా ఎన్నికలు వచ్చినా ఇంత వరకు కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు రాలేదని తెలిపారు. ‘‘నీళ్లు రాలేదు కానీ.. ఊరూరా బెల్టు షాపులను తెచ్చిపెట్టిండు. బడికిపోయే 12 ఏండ్ల పిల్లగాడు కూడా బీరు సీసా పట్టుకొని, బీఆర్ఎస్ జెండాను పట్టుకొని తిరుగుతుండు. బడికి పోయే పిల్లలు కూడా తాగుడుకు అలవాటు పడుతున్నరు’’ అని కేసీఆర్​పై ఫైర్​ అయ్యారు. పాలమూరు స్కీంను పూర్తి చేయలేదని, రైలు సౌకర్యం కల్పించలేదని అన్నారు.  

సిమెంట్ ఫ్యాక్టరీ,   నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని తెలిపారు. ‘‘మనల్ని నమ్మించి, మన నెత్తిమీద శఠగోపం పెట్టిన  కేసీఆర్ సిగ్గు లేకుండా మళ్లీ ఓట్లు అడుగుతున్నడు” అని మండిపడ్డారు.  నియోజకవర్గంలో సాగునీటి కోసం వైఎస్ రాజశేఖర్​రెడ్డి ‘నారాయణపేట –కొడంగల్’ స్కీంకు ప్రతిపాదన చేశారని, తాను పట్టుబట్టి ఈ స్కీంను వెంటనే ప్రారంభించాలని జీవో 69ను మంజూరు చేయించానని రేవంత్​ చెప్పారు. కానీ, కేసీఆర్ ఈ స్కీం గురించి పట్టించుకోలేదని, తాము అధికారంలోకి రాగానే ఈ స్కీమును టేకప్ చేస్తామని హామీ ఇచ్చారు. రెండేండ్లలో పూర్తి చేసి, ఇక్కడి ఆయకట్టును కృష్ణా జలాలతో తడుపుతామని ఆయన అన్నారు. 

కొడంగల్​ను ముక్కలు చేసిండు

‘‘కొడంగల్  అంటే కేసీఆర్​కు  కోపం. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేసిండు. ఒక ముక్కను వికారాబాద్​లో..  మరో ముక్కను నారాయణపేట జిల్లాలో పడేసిండు. ఇక్కడి ప్రజలు డీఈని కలవాలంటే తాండూరుకు.. ఎక్సైజ్ ఎస్ఐని కలవాలంటే పరిగికి.. నీళ్లు, కరెంటు కావాలంటే నారాయణపేటకు పోవాల్సివస్తున్నది” అని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో  పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా ఇవ్వలేదని, కేసీఆర్ మాత్రం వెయ్యి ఎకరాల్లో, ఆయన కొడుకు వంద ఎకరాల్లో ఫామ్ హౌస్​లు కట్టుకున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆయన తెలిపారు.

ALSO READ : బీఆర్ఎస్​కు ట్రిపుల్​ ఆర్​ గండం! .. అలైన్​మెంట్ మార్పులపై రైతుల్లో వ్యతిరేకత

‘‘ఎన్నికలు రావడంతో బీఆర్ఎస్ లీడర్లు రాత్రిళ్లు నోట్ల సంచులు, మందు సీసాలతో ఊర్ల పొంటి తిరుగుతున్నరు. ఓట్లు వేయించుకునేందుకు క్వార్టర్స్, హాఫ్, ఫుల్ బాటిళ్లు పంచుతున్నరు. ఓటర్లకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పంచుతున్నరు. ఓటును రూ.5 వేలకు అమ్ముకుంటే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పూర్తయితదా?” అని అన్నారు. కొడంగల్​లో ఇక్కడి ప్రజలు నాటిన మొక్క తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నదని, బతుకులు మారాలంటే కాంగ్రెస్ గెలవాలని కోరారు.  గ్రూపులు, గుంపులకు అతీతంగా ఊర్లు, తండాలు, గూడేలు ఏకమై కాంగ్రెస్​కు  అండగా నిలవాలని ఆయన  అన్నారు. ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి  సమక్షంలో కోస్గి మున్సిపల్ వైస్​ చైర్ పర్సన్​ కోడిగంటి అన్నపూర్ణ హరికుమార్​  500 మంది కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు.