నందు హీరోగా నటిస్తూ శ్యామ్ సుందర్ రెడ్డితో కలిసి నిర్మించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకుడు. యామిని భాస్కర్ హీరోయిన్‌గా నటించింది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 1న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది.
ఈ సందర్భంగా ఆడియెన్స్‌కు థ్యాంక్స్ తెలియజేస్తూ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నందు మాట్లాడుతూ ‘ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి రెస్పాన్స్‌తో పాటు పాజిటివ్ రివ్యూలు రావడం ఆనందంగా ఉంది. ఈరోజు కోసమే 18 ఏళ్లుగా ఎదురుచూశా.
ఈ సినిమా క్రెడిట్ అంతా డైరెక్టర్ వరుణ్ కే దక్కుతుంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఉలవచారు, బిర్యానీ లాంటిది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ముద్దపప్పు ఆవకాయ లాంటిది అందరికీ నచ్చుతుంది. మా కలల్ని నిజం చేసిన సురేష్ బాబు, రానాకు థాంక్యూ సో మచ్’ అని చెప్పాడు.
‘సైక్ సిద్ధార్థ’ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోందని, తాను పోషించిన శ్రావ్య పాత్రకు మంచి అప్లాజ్ రావడం హ్యాపీగా ఉందని యామిని భాస్కర్ చెప్పింది. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చిందని డైరెక్టర్ వరుణ్ రెడ్డి అన్నాడు.
