పాడైపోతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు

పాడైపోతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు
  •      లబ్ధిదారులను సెలక్ట్​ చేసినా అలాట్​ చేయలే..
  •     ఆత్మగౌరవ ఇండ్ల కోసం ఏండ్ల తరబడి ఎదురు చూపులు
  •     వృథాగా పడి ఉండడంతో కుంగిపోతున్న ప్లోరింగ్​
  •     మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నయ్​..

నిజాంపేట , వెలుగు: జిల్లాలో  డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టుడు కంప్లీటైన పేదలకివ్వకపోవడంతో పడావు పడుతున్నాయి. పేదల ఆత్మగౌరవ ఇండ్లు అంటూ లక్షలు ఖర్చు చేసి కట్టిన ఇండ్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో డ్యామేజ్​అవుతున్నాయి. సొంత ఇల్లు లేని పేదలు గుడిసెల్లో, కిరాయి ఇండ్లలో ఇబ్బందులు పడుతూ కొత్త ఇండ్లు ఎప్పుడిస్తరో అని ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. గ్రామ సభలు పెట్టి  లబ్ధిదారులను సెలక్ట్​చేసినా.. ఇండ్లు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో పేదలు తమ సొంతింటి కల కలగానే  మిగిలిపోతుందా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సొంతిండ్లు లేని నిరుపేదలందరికీ డబుల్​బెడ్​రూం ఇండ్లు కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వం   ప్రకటించింది. నిజాంపేట మండలంలోని 3 గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.  కల్వకుంట గ్రామంలో  74 డబుల్​ బెడ్​రూం ఇండ్లకు  475 మంది గ్రామస్తులు  అప్లై చేసుకున్నారు. ఆఫీసర్లు గ్రామసభ పెట్టి  లబ్ధిదారులను సెలెక్ట్​ చేశారు. కానీ ఏడాది దాటినా ఇండ్లను  ఎవరికీ కేటాయించడం లేదు. దీంతో డబుల్ ఇండ్ల  కిటికీల అద్దాలు ధ్వంసం కాగా, కొన్ని  రూంలలో ప్లోరింగ్​ కుంగిపోయింది. అలాగే చల్మెడ గ్రామంలో 40 డబుల్​ బెడ్ రూం ఇండ్లు నిర్మించగా  వాటి కోసం  178 మంది అప్లికేషన్​ పెట్టుకున్నారు. అయినా ఇండ్లు ఎవరికీ అలాట్​ చేయలేదు. ఇక్కడ నిర్మించిన ఇండ్లలోనూ  కొన్ని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. నందిగామలో కట్టిన 40  ఇండ్లు పూర్తయి నెలలు గడుస్తున్నా అవి కూడా లబ్ధిదారులకు 
అందడం లేదు. 

మందుబాబులకు అడ్డాలు..
కట్టిన ఇండ్లను ఎవరూ పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి.  కొందరు మందుబాబులు ఇండ్లలో సిట్టింగులు వేసి గలీజ్​చేస్తున్నారు. మందుబాటిళ్లు, సిగరెట్ల డబ్బాలతో వాల్స్​ను, డోర్​లను ఆగమాగం చేస్తున్నారు.

లబ్ధిదారులను ఎంపిక చేసి ఏడాదిన్నర..
డబుల్​బెడ్ రూం ఇండ్లు కేటాయించేందుకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు 20 జూన్ 2020లో చల్మెడ, కల్వకుంట గ్రామాలలో మెదక్  ఆర్డీవో సాయిరాం ఆధ్వర్యంలో గ్రామసభలను నిర్వహించారు.  అప్లికేషన్లను పరిశీలించి  లబ్ధిదారులను ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులకు, గ్రామ సర్పంచ్ లకు సూచించారు.  కల్వకుంటలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఏడాదిన్నర గడిచిపోయినా.. ఇంతవరకు ఇండ్లు ఇస్తలేరని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు కట్టిండ్రో అర్థమైతలేదు
మా ఊరిలో డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టి రెండేండ్లు అవుతోంది. కానీ ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా ఎవరికీ ఇయ్యలే. మరి లక్షలు పెట్టి ఇండ్లు ఎందుకు కట్టిండ్రో మాకైతే  అర్థమైతలేదు.- భూమయ్య, కల్వకుంట 

కట్టి ఏం లాభం..
మా  ఊళ్లో డబుల్​ బెడ్​ రూం ఇండ్లు కట్టడంతోని సొంతిండ్లు లేనోళ్లు ఇగ మాకు పక్కా వస్తదని మస్తు  మస్తు ఖుషీ అయ్యిన్రు. కానీ రెండేండ్లయినా ఇండ్లు  ఎవలికీ ఇయ్యలే. ఇగ ఇండ్లు కట్టి ఏం లాభం.   - చంద్రం, కల్వకుంట

ఉండనీకి  ఇల్లు లేదు..
మేము గరీబోళ్లం. మాకు  ఉండనీకె సొంత ఇల్లు లేదు. కిరాయి ఇంట్ల ఉంటున్నం. మస్తు తక్లీబ్ అయితుంది. సర్కార్​ కట్టిన ఇండ్లు మా అసొంటోళ్లకు ఇస్తే బాగుంటది. కానీ ఉట్టిగ పడావు పెడితే ఏమొస్తది. - సత్తవ్వ, చల్మెడ