పట్టాలు ఇచ్చి ..ఇండ్లలోకి పోనిస్తలే

పట్టాలు ఇచ్చి ..ఇండ్లలోకి పోనిస్తలే
  • కొత్తింట్లో దసరా చేసుకోవాలనుకుంటున్న లబ్ధిదారులు 
  • లిఫ్టులు, ఎలక్ట్రికల్, వాటర్  పనులు పూర్తి కాలేవంటూ ఆపేసిన అధికారులు
  • కొల్లూరుతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి
  • పట్టాలు అందుకున్న వారు ఇండ్లలోకి వచ్చేందుకు ఎదురుచూపులు
  • ఆలస్యం అవుతుండటంతో ఆందోళన

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసుకోలేకపోతున్నారు. పట్టాలు అందుకున్నప్పటికీ లిఫ్ట్, వాటర్, ఎలక్ట్రిసిటీ తదితర పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారుల చేతికి అధికారులు ఇండ్ల తాళాలు ఇవ్వడం లేదు.  గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తామన్న ప్రభుత్వం దాదాపు 70  వేల ఇండ్లను మాత్రమే అందించింది.  ఇందులో నెల రోజులుగా మూడు విడతల్లో 60 వేల ఇండ్లను లబ్ధిదారులకు అందించారు.  అత్యధికంగా కొల్లూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15,660  ఇండ్లను నిర్మించారు.  

ఏడాది క్రితమే వీటి నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చి లబ్ధి పొందాలని బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్లాన్ చేసింది. నిర్మాణాలు పూర్తయి ఎక్కువ రోజులు అలాగే ఉంచడంతో కొన్ని రిపేర్లు చేయాల్సి ఉంది.  వీటితో పాటు కొన్ని పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో పట్టాలు అందుకున్న వారిని ఇండ్లలోకి అనుమతించడం లేదు.  ఒక్క కొల్లూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కాకుండా గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది.  

పట్టాలిచ్చారని సంతోషపడుతున్న లబ్ధిదారులను ఇండ్లలోకి రానివ్వకపోవడంతో తమ సొంతింట్లోకి ఇంకెప్పుడు వెళ్తామోనని వారు ఎదురు చూస్తు న్నారు.  అన్ని పనులు పూర్తి చేసి ఇండ్ల పట్టాలు అప్పగించి ఉంటే బాగుండేదని అంటున్నారు. 

పేర్లలో తప్పులతో తిప్పలు.. 

డబుల్ బెడ్రూం ఇండ్ల  లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల్లో కొన్నింటిలో తప్పులు ఉండటంతో వాటిని సరిచేసుకోడానికి తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరి పట్టాల్లో కులం, ఆధార్ నంబర్, పేర్లు తదితర తప్పులు పడటంతో ఆ పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వలేదు.  కొందరికి తప్పులతో ఉన్న పట్టాలను అలాగే అందించారు.  ఇండ్లలోకి  మాత్రం అనుమతించడం లేదు.  ః

అన్నీ సరిచేసుకొని వచ్చిన తర్వాతనే  ఇండ్లను అప్పగిస్తామని అధికారులు అంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. తప్పుల సవరణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదని అధికారులు  చెబుతున్నారు. అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో లబ్ధిదారులు ఆమోయమంలో పడ్డారు. 

ఎన్నికల తర్వాతేనా?

పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో చాలా మంది దసరా పండుగకు కొత్త ఇండ్లలోకి వెళ్దామని అనుకున్నారు.  కొత్త ఇంట్లో పండుగ చేసుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే,  ఇండ్లను ఎప్పుడు అప్పగిస్తారనే  దానిపై అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు.  కొన్ని పనులు కాకపోవడంతోనే ఇండ్లు ఇవ్వడం లేదని చెబుతున్నారు. తాము ఫోన్లు చేస్తామని.. అప్పుడే వచ్చి ఇంటి తాళాలు తీసుకోవాలని పట్టాలు అందుకున్న వారితో అధికారులు చెబుతున్నారు.  

కానీ తొలి విడతలో పట్టాలు తీసుకొన్న వారికి నెల దాటినా ఇంకా అధికారుల నుంచి ఫోన్లు రాలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో అధికారులు బిజీలో ఉన్నారు. ఈ టైమ్​లో ఇండ్లను ఇస్తారా? లేదా? అని లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలు పూర్తయిన తర్వాతనే వీరికి ఇండ్లను అందించనున్నట్లు తెలుస్తోంది.