మూసీ నిరాశ్రయులకు డబుల్ బెడ్​రూమ్ ఇండ్లు

మూసీ నిరాశ్రయులకు డబుల్ బెడ్​రూమ్ ఇండ్లు
  • ఇందిరమ్మ ఇండ్ల రివ్యూలో వివరాలు అడిగిన సీఎం 
  • గ్రేటర్​ పరిధిలో ఖాళీగా30 వేల ఇండ్లు
  • కొన్నింటిలో పనులు పెండింగ్
  • బ్యూటిఫికేషన్ ​పైసలతో డబుల్ ఇండ్లకు రిపేర్లు

హైదరాబాద్, వెలుగు: మూసీ నది బ్యూటిఫికేషన్​పై సీఎం రేవంత్​రెడ్డి స్పెషల్​ఫోకస్​పెట్టారు. సిటీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ అంశాన్ని గుర్తుచేస్తున్నారు. బ్యూటిఫికేషన్​లో భాగంగా గ్రేటర్​పరిధిలో ఇండ్లు కోల్పోయేవారికి డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇటీవల ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి హౌసింగ్ శాఖ అధికారులతో సీఎం నిర్వహించిన మీటింగ్​లో ఈ అంశంపై చర్చించారు. గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్మించిన డబుల్ బెడ్​రూమ్​ఇండ్లతోపాటు, లబ్ధిదారులకు అందించిన వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎన్ని ఎండ్లు ఖాళీగా ఉన్నాయో ఆరా తీశారు. కాగా ప్రస్తుతం 30 వేల ఇండ్లు ఖాళీగా ఉండగా, వీటిలో ఇంకా పనులు చేయాల్సి ఉంది. అవి పూర్తి చేస్తే తప్ప అప్పగించలేని పరిస్థితి నెలకొంది. మూసీ బ్యూటిఫికేషన్​కోసం తీసుకొచ్చే లోన్​నుంచి కొంత మొత్తాన్ని ఇండ్ల పనులకు వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యూటిఫికేషన్​పనుల కంటే ముందే ఇండ్ల పనులు చేపట్టనున్నారు. 

లంగర్ హౌస్ నుంచి నాగోలు వరకు..

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాల పరిధిలో మూసీ నది 44 కిలోమీటర్లు ఉంది. గతంలో రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో నది బఫర్​జోన్​లో 9 వేల అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించారు. ప్రస్తుతం రెండింతలై ఉంటాయని అంచనా. మూసీ నదికి ఇరు వైపులా 50 మీటర్ల మేర బఫర్ జోన్​లో ఉన్న నిర్మాణాలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని అప్పట్లో అధికారులు గడువు ఇచ్చారు. తర్వాత కొందరికి నోటీసులు జారీ చేశారు. అంతలోనే ఎన్నికలు రావడం, బీఆర్ఎస్​దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడింది. గతంలో మూసీ బ్యూటిఫికేషన్​లో ఇండ్లు కోల్పోతున్నవారు డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది. ముందుగా నిర్వాసితులకు డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు అందించి, తర్వాత బ్యూటిఫికేషన్​పనులు స్టార్ట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Also Read: హైదరాబాద్ శివారులో వాటర్ పరేషాన్ .. సమ్మర్ సీజన్లో కొరత

అర్హులందరికీ ఇండ్లు


మూసీ పరివాహక ప్రాంతంతో ఎప్పటి నుంచో నివాసముంటున్న వారిలో అర్హులైన పేదలకు డబుల్​ ఇండ్లు అందించి, ప్రస్తుతం ఉంటున్న ఇండ్లను ఖాళీ చేయించాలని చూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముసారాంబాగ్, లంగర్ హౌస్, నాంపల్లి, అంబర్ పేట, చాదర్​ఘాట్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గతంలో గుర్తించారు. ఈ ప్రాంతాల్లోని అర్హులకు ముందుగా డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు కేటాయించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే హౌసింగ్ అధికారులకు ఆదేశాలు అందాయి. వీలైనంత త్వరగా ఇండ్లు కేటాయించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.