పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో లబ్ధిదారులు ఉండట్లేదు. వందల సంఖ్యలో తాళాలు వేసిన ఫ్లాట్స్ దర్శమిస్తున్నాయి. మరికొన్ని కిరాయి దారులతో నిండిపోయాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ టౌన్ షిప్ లో చాలావరకు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.
అయితే వీటిలో లబ్ధిదారుల కుటుంబాలు మాత్రమే ఉండాలనే రూల్ ఉంది. అయితే.. టౌన్ షిప్ లోని సుమారు 552 ఫ్లాట్స్ కు తాళాలు వేశారు. 700 ఫ్లాట్స్ ను అద్దెకిచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. మరోవైపు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో త్వరలోనే కిరాయిదారులను ఖాళీ చేయించి వాటిని స్వాధీనం చేసుకోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలోనే స్పెషల్ టౌన్ షిప్
రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాల్లో కొల్లూరు టౌన్ షిప్ కు ప్రత్యేకత ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే 145 ఎకరాల్లో రూ.1,432 కోట్లతో15,556 ఫ్లాట్స్ నిర్మించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద టౌన్ షిప్ గా గుర్తింపు పొందింది. దాదాపు 60 వేల మంది నివాసముండేలా117 బ్లాకుల వారీగా జి ప్లస్–-9,జి ప్లస్-–10, జి ప్లస్–-11 ఫ్లోర్లు నిర్మించారు. ప్రతి బ్లాక్ కు రెండు లిఫ్టుల సౌకర్యం కల్పించారు. మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు, వాణిజ్య సముదాయం కూడా ఏర్పాటుచేశారు. తాగునీరు, విద్యుత్ ఇతరత్రా సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఆదర్శంగా కొల్లూరు డబుల్ ఇండ్లు
కొల్లూరు డబుల్ బెడ్రూమ్ టౌన్ షిప్ లో విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ.. సీఎస్ఆర్ ఫండ్స్ రూ.8 కోట్లతో 60 గదుల స్కూల్ బిల్డింగ్, డైనింగ్ హాల్, అంగన్ వాడీ సెంటర్ నిర్మాణ పనులకు ఇటీవల మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. టౌన్ షిప్ నుంచి హైదరాబాద్ కు సిటీ బస్సు సర్వీస్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాలనీవాసులకు రేషన్ షాపు, పోలీస్ ఔట్ పోస్టు, పీహెచ్ సీ సెంటర్ అందుబాటులో ఉండేలా పనులు నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా బెడ్ రూమ్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. ఇందులో రాష్ట్రంలోని అన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు, లబ్ధిదారులు, ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల వంటి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున లబ్ధిదారులు ఎవరు కూడా ఫ్లాట్లను ఇతరులకు అద్దెకు ఇవ్వొద్దని.. ఇస్తే ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుంటామని గృహనిర్మాణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
