ఇండ్లు కట్టి రెండేండ్లు అయినా ఇస్తలేరు

ఇండ్లు కట్టి రెండేండ్లు అయినా ఇస్తలేరు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం రాజీవ్ నగర్ లో డబుల్​ బెడ్​రూమ్ ఇండ్లు పూర్తయినా.. ఎంతకూ పంపిణీ చేయకపోవడంతో విసుగు చెందిన పేద ప్రజలు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. తమకు ఇండ్లు కేటాయించేంత వరకు ఇక్కడి నుంచి ఖాళీ చేసేది లేదని అధికారులకు తెగేసి చెప్పారు. లోపలి నుంచి తలుపులు పెట్టుకోవడంతో.. వారిని ఖాళీ చేయించలేక ఆఫీసర్లు వెనుదిరిగి వెళ్లారు. మంచిర్యాల రాజీవ్ నగర్ లో 650 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు. వీటి కోసం దరఖాస్తులు కోరగా.. మొత్తం 8 వేల మంది అప్లై చేసుకున్నారు. మొదటి విడతలో ఇండ్ల కోసం భూమి ఇచ్చిన 30 మందికి కేటాయించారు. ఏండ్లు గడుస్తున్నా మిగతా ఇండ్లు కేటాయించడం లేదు. అధికార పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు, లీడర్లు ఇండ్లు ఇప్పిస్తామంటూ పేదల దగ్గర పైసలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న పేదల్లో కొందరు మంగళవారం రాత్రి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు కరెంట్ కట్​చేయించారు. బుధవారం ఉదయం సుమారు 60 మంది కుటుంబాలతో సహా ఇండ్లలోకి ప్రవేశించారు. ఆర్డీవో వేణు, తహసీల్దార్ రాజేశ్వర్ పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. దరఖాస్తులపై సర్వే చేస్తున్నామని, వారం రోజుల్లో లాటరీ తీసి ఇండ్లు కేటాయిస్తామని, అప్పటి వరకు ఖాళీ చేయాలని కోరారు. ఇప్పటికే రెండేండ్లుగా ఇండ్ల కోసం తిరుగుతున్నామని, అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని, అందుకే తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లినట్లు వారు చెప్పారు. ఖాళీ చేయాలని ఆఫీసర్లు ఎంత నచ్చచెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. లోపలి నుంచి తలుపులు పెట్టుకున్నారు. ఇండ్లు కేటాయించేంత వరకు ఇక్కడే ఉంటామని భీష్మించడంతో ఆఫీసర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.