గజ్వేల్‌‌‌‌ డబుల్‌‌‌‌ ఇండ్ల కోసం లబ్ధిదారులు వర్సెస్‌‌‌‌ నిర్వాసితులు

గజ్వేల్‌‌‌‌ డబుల్‌‌‌‌ ఇండ్ల కోసం లబ్ధిదారులు వర్సెస్‌‌‌‌ నిర్వాసితులు
  • డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లలో ఉంటున్న మల్లన్నసాగర్‌‌‌‌ నిర్వాసితులు
  • డ్రాలో పేరు వచ్చినందున పొజిషన్‌‌‌‌ ఇవ్వాలంటున్న లబ్ధిదారులు
  • పరిహారం ఇచ్చే వరకు ఖాళీచేసేది లేదంటున్న నిర్వాసితులు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : గజ్వేల్‌‌‌‌ ప్రజ్ఞాపూర్‌‌‌‌ మున్సిపాలిటీలో డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియ రోజురోజుకు సమస్యగా మారుతోంది. గతంలోనే పూర్తైన డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్లను మల్లన్నసాగర్‌‌‌‌ నిర్వాసితులకు తాత్కాలిక వసతి కింద కేటాయించారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదరాబాదరాగా లబ్దిదారుల ఎంపికను సైతం పూర్తి చేశారు. ఇప్పుడు పొజిషన్‌‌‌‌ చూపించాలని లబ్ధిదారులు, పరిహారం ఇచ్చే వరకు ఇండ్లు ఖాళీ చేయబోమని నిర్వాసితులు పట్టుబట్టారు. ఇదిలా ఉంటే గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని, మరోసారి సర్వే చేయాల్సిందేనని కొత్త డిమాండ్‌‌‌‌ తెరపైకి రావడంతో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. 

గతేడాది మార్చిలో అర్హుల గుర్తింపు

గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పేదల కోసం మొత్తం 1,250 డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లు నిర్మించారు. ఇందులో రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన వారి కోసం 132 ఇండ్లను కేటాయించగా, మిగిలిన 1,118 ఇండ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు 2021 నోటిఫికేషన్ విడుదల చేసి అప్లికేషన్లు తీసుకున్నారు. మొత్తం 3,512 అప్లికేషన్లు రావడంతో అర్హుల గుర్తింపు కోసం జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఆరు టీమ్‌‌‌‌లను ఏర్పాటు చేసి సర్వే చేశారు. 

దాదాపు ఏడాదిన్నర పాటు సర్వే కొనసాగగా  1,118 మంది లబ్ధిదారులను గుర్తిస్తూ డ్రాఫ్ట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ను ప్రకటించారు. ఈ లిస్ట్‌‌‌‌పై అభ్యంతరాలు రావడంతో గతేడాది మార్చిలో లక్కీ డ్రా ద్వారా 1,100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి ఇప్పటివరకు ఇండ్లను కేటాయించలేదు. దీంతో డ్రాలో ఎంపికైనప్పటికీ ఇల్లు ఎందుకు కేటాయించడం లేదంటూ లబ్దిదారులు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు.

రెండేండ్ల కింద మల్లన్నసాగర్‌‌‌‌ నిర్వాసితులకు..

నిర్మించిన డబుల్‌‌‌‌ ఇండ్లను రెండేండ్ల కింద మల్లన్నసాగర్‌‌‌‌ నిర్వాసితుల తాత్కాలిక వసతి కోసం కేటాయించారు. అప్పటి నుంచి వారు ఆ ఇండ్లలోనే ఉంటున్నారు. లక్కీ డ్రాలో లబ్ధిదారులను గుర్తించిన ఆఫీసర్లు వారికి ఇండ్లు కేటాయించేందుకు నిర్వాసితులను ఖాళీ చేయాలని ఆదేశించారు. కానీ పరిహారం, ప్యాకేజీ వచ్చే వరకు తాము ఖాళీ చేసేది లేదని నిర్వాసితులు పట్టుబట్టారు. డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూమ్‌‌‌‌ కాలనీలోని 70 శాతం ఇండ్లలో  నిర్వాసితులు ఉంటుండగా, కొన్నింటికి తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. దీంతో వారిని ఎలా ఖాళీ చేయించాలో తెలియక ఆఫీసర్లు అయోమయంలో పడిపోయారు. ఇండ్ల విషయంలో కొన్ని సార్లు లబ్ధిదారులకు, నిర్వాసితులకు మధ్య గొడవలు సైతం జరిగాయి.

సర్వేను అడ్డుకుంటున్న నిర్వాసితులు

డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్ల సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డబుల్‌‌‌‌ ఇండ్లలో ఉంటున్న నిర్వాసితుల సమస్యలేంటి, పరిహారం, ప్యాకేజీ అందని వారెందరు ? ఓపెన్‌‌‌‌ ప్లాట్లు అందని వారెంత మంది ఉన్నారు ? తాత్కాలిక నివాసాల్లో వుంటున్న నిర్వాసితులు ఎంత మంది ? అనే అంశంపై సర్వేకు సిద్ధమయ్యారు. అయితే తమకు పూర్తి స్థాయి పరిహారం అందే వరకు ఇండ్లను వీడేది లేదంటూ నిర్వాసితులు సర్వేను సైతం అడ్డుకున్నారు. అలాగే పలువురు నిర్వాసితులు మంత్రి దామోదర్‌‌‌‌ రాజనర్సింహను కలిసి తమకు పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చాకే ఖాళీ చేయించాలని వినతి పత్రం అందజేశారు.

తెరపైకి కొత్త డిమాండ్‌‌‌‌

డబుల్‌‌‌‌ ఇండ్ల కేటాయింపు ఇప్పటికే సమస్యగా మారగా మరో వైపు కొత్త డిమాండ్‌‌‌‌ తెరపైకి వచ్చింది. గత ప్ర.భుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబుల్‌‌‌‌ ఇండ్లు పంపిణీ చేశారని, తిరిగి సర్వే చేసి అర్హులైన వారిని ఎంపిక చేయాలని కోరుతూ జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు. మరోసారి సర్వే నిర్వహించి అర్హులైన వారిని గుర్తించి ఇండ్లు కేటాయించాలంటూ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంత్రిని కలిశారు. ఇప్పటివరకు ఉన్న సమస్యకు తోడు మరో డిమాండ్‌‌‌‌ తెరపైకి రావడంతో డబుల్‌‌‌‌ ఇండ్ల పంపిణీ అసలు ముందుకు సాగుతుందా ? లేదా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సమస్య పరిష్కారానికి చర్యలు 

గజ్వేల్‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్ల కేటాయింపు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిర్వాసితుల సమస్యలపై సర్వే ప్రారంభించారు. ఎవరెవరికి సమస్యలు ఉన్నాయో గుర్తించి రిపోర్ట్‌‌‌‌ను ఉన్నతాధికారులకు అందజేస్తాం. 

బన్సీలాల్, ఆర్డీవో గజ్వేల్