
లక్ష్యానికి దూరంగా ఇండ్ల నిర్మాణం.. కట్టినవి కూడా ఇస్తలేరు
పలు జిల్లాల్లో నిధుల లేమి, స్థలాల కొరత సహా ఎన్నో సమస్యలు
జాగా ఉన్నోళ్లకు పైసలిస్తామన్న హామీ ఊసేలేదు
వెలుగు, నెట్వర్క్: సామాన్యుల సొంతింటి కలలు క్రమంగా కరిగిపోతున్నాయి. టీఆర్ఎస్ సర్కారు నాలుగేళ్ల క్రితం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు నత్తకే నడక నేర్పుతున్నాయి. సిద్దిపేట, ఖమ్మంలాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్ప రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇండ్లు పునాది దశలోనే మగ్గుతున్నాయి. గ్రేటర్‌హైదరాబాద్‌తో కలుపుకొని తెలంగాణలోని గూడు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వివిధ దశల్లో 2లక్షల 82వేల 416 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు కిందా మీదా పడి కేవలం 34 వేల151 గృహాలనే నిర్మించగలిగింది. అంటే లక్ష్యంలో 12శాతం వద్దే సర్కారు చతికిలపడింది. ఏకంగా నాలుగు జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తికాలేదు. ఆరు జిల్లాల్లో పట్టుమని 100 ఇండ్లు కూడా కట్టలేదు. ఎనిమిది జిల్లాలు మినహా ఎక్కడా వెయ్యి మార్కు దాటలేదు. ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించిన రేట్లు తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడం, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల అంతులేని నిర్లక్ష్యం, సరిపడా నిధులు లేకపోవడం, స్థలాల కొరత తదితర కారణాలతో పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
2015లో పథకం ప్రారంభం..
2014 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు లక్షల్లో డబుల్ బెడ్‍రూం ఇళ్లను నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇవిగాక గ్రేటర్ హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్లు అదనంగా కట్టిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా 2015 అక్టోబర్‌లో ప్రభుత్వం తరుపున పథకాన్ని ఘనంగా ప్రకటించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లతో మోడల్ కాలనీ నిర్మించి మార్చి 5, 2016న అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సొంత నియోజకవర్గాల్లో తప్ప డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం ఎక్కడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.
గ్రేటర్ హైదరాబాద్‌ను మినహాయిస్తే సీఎం సొంత జిల్లా సిద్దిపేటకే అత్యధికంగా 14,703 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఆ తర్వాతి రెండు స్థానాల్లో వరుసగా ఖమ్మం(14,560), నిజామాబాద్(11,066) జిల్లాలున్నాయి. కానీ సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నప్పటికీ కేవలం 5,237 ఇండ్లను మాత్రమే పూర్తిచేయించగలిగారు. ఆ జిల్లా లక్ష్యంలో ఇది35శాతమే. మిగిలిన జిల్లాలతో పోల్చి చూసినప్పుడు మాత్రం ఇదే అత్యధికం. మొత్తంగా కేవలం 8 జిల్లాల్లో మాత్రమే వెయ్యికి పైగా డబుల్ బెడ్‍రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇందులో మహబూబ్‌నగర్(2214), కామారెడ్డి(1736), రాజన్న సిరిసిల్ల(1407), భద్రాద్రి(1741), ఖమ్మం(2547), నల్గొండ(1893), సూర్యపేట(1429) తప్ప ఏ జిల్లా కూడా ఇప్పటివరకు వెయ్యి మార్కు దాటలేదు. ఇకపోతే జోగులాంబ గద్వాల(12), నాగర్‌కర్నూల్(50), వనపర్తి(45), మంచిర్యాల(72), పెద్దపల్లి(24), రంగారెడ్డి(50) జిల్లాల్లో పూర్తయిన ఇళ్లు వందలోపే ఉండగా, కుమురంభీం ఆసిఫాబాద్, వికారాబాద్, నారాయణపేట్ జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఇల్లూ పూర్తికాలేదు.
కారణాలెన్నో..
ఒక్కో డబుల్ బెడ్‍రూం ఇంటి నిర్మాణానికి రూరల్ ఏరియాలో రూ. 5లక్షల4వేల చొప్పున, అర్బన్ ఏరియాలో రూ. 5లక్షల30వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఇంకా మౌలిక వసతుల కోసం పట్టణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్‌కు రూ.75వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షా25వేలు అందజేస్తామని చెప్పింది. చాలా పట్టణాల్లో స్థల సేకరణ ప్రధాన సమస్యగా మారడంతో వ్యక్తిగత ఇళ్లకు బదులు జీ ప్లస్, జీ ప్లస్ ప్లస్ మోడల్ నిర్మాణాలు చేపట్టవచ్చని స్పష్టత ఇచ్చింది. కానీ చాలా జిల్లాల్లో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన కనిపించలేదు. ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్ల ప్రకారం ఇళ్ల నిర్మాణం తమకు గిట్టుబాటు కాదని వాదించారు. కొన్ని జిల్లాల్లో ధైర్యం చేసి ముందుకు వచ్చిన కొందరు కాంట్రాక్టర్లు ఆ తర్వాత మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లిపోయారు. నిజామాబాద్ లాంటి జిల్లాల్లో మహారాష్ట్ర కు చెందిన ఒకటి, రెండు కంపెనీలుటెండర్ దక్కించుకున్నా అవి కూడా మధ్యలోనే జారుకున్నాయి. మొత్తంగా గత నెల 31వరకు డబుల్ బెడ్‍రూం ఇళ్ల పథకంపై ప్రభుత్వం రూ. 6992.54 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారికగణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
శాఖల మధ్య సమన్వయ లోపం..
డబుల్ బెడ్‍రూం ఇళ్ల పథకానికి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపమూ శాపంగా మారింది. ముఖ్యంగా రెవెన్యూ, విద్యుత్‌శాఖ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖల మధ్య సఖ్యత లేకపోవడం ప్రధాన సమస్యగా తయారైంది. గ్రామీణ ప్రాంతంలో పంచాయతీరాజ్, పట్టణ ప్రాంతంలో ఆర్‌అండ్‌బీ శాఖలు ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టాల్సి ఉంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భూసేకరణ లక్ష్యం అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. కొన్నిచోట్ల విద్యుత్ సౌకర్యం కల్పించేందుకే నెలలు పడుతోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఆయా శాఖలను సమన్వయపరచి పనులను పరుగెత్తించాల్సిన ఉన్నతాధికారులు, లీడర్లు ఆ దిశగా దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి.
పనుల్లోనూ నాణ్యత లోపం..
జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే విమర్శలున్నాయి. నాసిరకం సిమెంటు, ఇటుకలు వాడుతున్నారనీ, పిల్లర్ల నిర్మాణంలో సరైన సలాకను వినియోగించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు కొన్నిచోట్ల గోడలు కూలిపోవడం ఇందుకు ఊతమిస్తోంది.
కేటాయింపుల్లో అంతులేని జాప్యం
గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50శాతం, మైనారిటీలకు 7శాతం, ఇతరులకు 43శాతం ఇళ్లను, పట్టణప్రాంతాల్లో ఎస్సీలకు17శాతం, ఎస్టీలకు 6శాతం, మైనారిటీలకు 12శాతం, ఇతరులకు 65శాతం ఇళ్లను కేటాయించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈమేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో పకడ్బందీగా చేపట్టాల్సి ఉంటుంది. కానీ చాలాప్రాంతాల్లో నిర్మాణం పూర్తిచేసుకున్న కొద్దిపాటి ఇళ్లనూ లబ్ధిదారులకు కేటాయించడం లేదు. అర్హుల నడుమ పోటీ తీవ్రంగా ఉండడం, రాజకీయ జోక్యం కారణంగా వాటిని కేటాయింపు అధికారులకు తలనొప్పిగా మారింది. మరీ ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం వేలాది దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పదులు, వందల్లో ఉన్న ఇళ్లను పంపిణీ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనీ, అంతిమంగా ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందని అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఎన్నికలు జరిగేదాకా ఇళ్ల పంపిణీని పక్కనపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకే పలుచోట్ల ఇళ్లను కేటాయించాలని ప్రజలు ఆందోళనకు దిగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పోటీ తక్కువగా ఉన్నచోట ఇళ్లను కేటాయిస్తున్నా, రోడ్లు, తాగునీరు, ఇతరత్రా మౌలికవసతులు లేకపోవడంతో ప్రజలు ఉండలేకపోతున్నారు.
ఎన్నెన్ని సిత్రాలో..
జగిత్యాల నూకపల్లి అర్బన్ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో 4,162 ఇండ్లకు అప్పటి ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్ ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. ఇక్కడ కేవలం 162 ఇండ్లు మాత్రమే కట్టారు. మిగిలిన 4వేల ఇండ్ల కోసం పునాదులు తవ్వి వదిలేశారు. కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయారు.
ఇదే జిల్లాలోని ధరూర్, టీఆర్నగర్లలో రెండు నెలల క్రితం మంత్రి కొప్పుల ఈశ్వర్ 20 ఇండ్ల చొప్పున ప్రారంభించారు. కానీ నీరు, ఇతరత్రా వసతులు లేక ధరూర్ కాలనీలోని లబ్ధిదారులు ఇండ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇక్కడ తొమ్మిది కుటుంబాలు దొంగల భయంతో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నాయి.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సీఎం దత్తత గ్రామం చిన్నముల్కనూరులో 247 ఇండ్లు నిర్మించారు. కానీ వీటిని నేటికీ అధికారికంగా ప్రారంభించలేదు. కొందరు తమకు తాముగా వెళ్లి కొన్ని ఇండ్లలో ఉంటుండగా, మిగిలిన ఇండ్లలో ఉండేవారు లేక ఆవరణలో పిచ్చి చెట్లు పెరిగాయి.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 280ఇళ్లకు 2017 లో మాజీ ఎంపీ కవిత భూమి పూజ చేశారు. కేవలం 80 ఇండ్లు జీ ప్లస్ 2 పద్ధతిలో పూర్తికాగా, వాటిని కేటాయించలేని పరిస్థితి. పోటీ ఎక్కువ కావడంతో డ్రా తీసి పంపిణీ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రకటించినా సాధ్యం కావడం లేదు.
ఖమ్మం జిల్లాలో నిర్మాణం పూర్తిచేసుకున్న 2,547 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించడం అధికారులకు కత్తిమీద సాములామారింది. గత నెల నుంచి వివిధ గ్రామాల్లో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేస్తుండగా, ఇందుకోసం ఏర్పాటుచేస్తున్న గ్రామసభలు గొడవలకు దారిస్తున్నాయి. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వర్రావు కొంత మంది కాంట్రాక్టర్లతో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభింపజేసినా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు గిట్టుబాటు కావడం లేదని చేతులెత్తేశారు.
సిద్దిపేట జిల్లాలో 7 ,136 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా వరుస ఎన్నికల కారణంగా గృహ ప్రవేశాలు చేయించలేకపోయామని అధికారులు చెబుతున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో1800 ఇండ్ల నిర్మాణం పూర్తయినా నేటికీ లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. ఇందులో 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులకు హాస్టల్ గా వినియోగిస్తున్నారు.
వరంగల్ జిల్లా కాజిపేట్ మండలం శాయంపేటట్లో 608 ఇళ్ల పనులు ప్రారంభించగా, స్థానికులు అడ్డుకున్నారు. ఆ భూమిని గతంలో ప్రభుత్వం తమకు అసైన్డ్ చేసిందని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కోర్టుకు వెళ్లారు. దీంతో అక్కడ పనులు నిలిచిపోయాయి.
అద్దె బాధల నుంచి విముక్తి కల్పించాలె..
సిద్దిపేట మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా అర్హులకు పంపిణీ చేయడం లేదు. మేమంతా సొంతింటి కోసం అశగా ఎదురుచూస్తున్నాం. పూర్తయిన ఇండ్లను వెంటనే అర్హులకు కేటాయించి, అద్దె బాధల నుంచి విముక్తి కల్పించాలె.
– వడ్లకొండ గణేశ్, సిద్దిపేట
జాగలున్నోళ్లకు పైసలెప్పుడు?
డబుల్ బెడ్రూం ఇండ్లు అనుకున్నంత వేగంగా సాగకపోవడంతో గతేడాది అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు సీఎం కేసీఆర్ కొత్త హామీ ఇచ్చారు. సొంత జాగలు ఉండి ఇండ్లు లేని వాళ్లు.. ఇండ్లు కట్టుకునేందుకు నేరుగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తమని ప్రకటించారు. లబ్ధిదారులు తమకు నచ్చినట్టు ఇండ్లు కట్టుకోవచ్చని కూడా చెప్పారు. ఎలక్షన్సభలన్నింటిలోనూ ఈ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోనూ పేర్కొన్నారు. రెండోసారి టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటై తొమ్మిది నెలలైనా ఈ హామీ ఊసే లేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోగానీ, ఫుల్ బడ్జెట్లోగానీ ఆర్థిక సాయం ప్రస్తావనే లేదు. ఇప్పటికే మంజూరు చేసిన 2.82 లక్షల ఇండ్లను వచ్చే ఉగాది నాటికే పూర్తి చేస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు.
ఇల్లు ఇచ్చినా అద్దెకే ఉంటున్నం..
మాకు డబుల్ బెడ్ రూం కేటాయించారు. కానీ ఇక్కడ తాగునీరు సహా ఎలాంటి వసతులు కల్పించలేదు. రోడ్డు ఏమీ బాగా లేదు. ఏదైనా ఆపద వస్తే అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. చేసేది లేక టీఆర్ నగర్ లో అద్దెకుంటున్నాం.
– కంపెల్లి లక్ష్మి, లబ్ధిదారు, ధరూర్, జగిత్యాల