ఖమ్మంలో ‘డబుల్ ఇండ్ల’ లొల్లి.. స్థలాలు ఇచ్చినవారికి ముందుగా ఇవ్వాలని డిమాండ్

ఖమ్మంలో ‘డబుల్ ఇండ్ల’ లొల్లి.. స్థలాలు ఇచ్చినవారికి ముందుగా ఇవ్వాలని డిమాండ్
  • హైకోర్టులో కేసు ఉండడంతో , కేటాయింపు చేయొద్దని ఆందోళన
  •      ఇండ్లను ఖాళీ చేయించేందుకు  పోలీసుల మోహరింపు

పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లాలో డబుల్ బెర్రూమ్ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆందోళనకు దిగారు.  స్థలాలు ఇచ్చిన అందరికీ ముందుగా ఇండ్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కొందరు ఇండ్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..  పెనుబల్లి మండలం ఎరుగట్లలో 2020లో డబుల్ ఇండ్లను నిర్మించేందుకు15 మంది తమ సొంత స్థలాలను ఇచ్చి గుడిసెలను ఖాళీ చేశారు. 

వీరికి తొలి ప్రాధాన్యతగా ఇండ్లను కేటాయించాలని గత సర్కార్ అధికారులను ఆదేశించింది. కాగా.. గత జులైలో అధికారులు గ్రామసభ నిర్వహించి 40 మందిని ఎంపిక చేసిన జాబితాను కలెక్టర్ కు అందజేశారు.  దీంతో సొంత స్థలాలు ఇచ్చినవారు తమకు ఇండ్లు ఇవ్వలేదని, అధికారులు అన్యాయం చేశారని  హైకోర్టులో పిటిషన్ వేశారు. జాగాలు ఇచ్చినవారికి ముందుగా ఇండ్లను కేటాయించాలని కలెక్టర్ ను హైకోర్టు ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో  ఐదుగురికి ఇండ్లు కేటాయించి మరో10 మందిని అనర్హులుగా అధికారులు గుర్తించారు. 

దీంతో హైకోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని బుధవారం తహసీల్దార్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు.  కేసు కోర్టులో ఉందని ఇండ్ల కేటాయింపు చేయొద్దని గురువారం నిరసనకు దిగారు. ఇంకా ఇండ్లు కేటాయింపు చేయలేదని, స్థలాలు ఇచ్చిన వారి పేర్లను మళ్లీ పరిశీలించి, విచారణ చేసి కలెక్టర్ కు నివేదిక ఇస్తామని పెనుబల్లి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తు లింగయ్య, వీఎం బంజరు ఎస్ఐ వెంకటేశ్​ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించి ఇండ్లలో ఉండేవారిని ఖాళీ చేయించారు.