ఇండియా కూటమిలో.. పీఎం క్యాండిడేట్​పై తలోమాట

ఇండియా కూటమిలో.. పీఎం క్యాండిడేట్​పై తలోమాట
  • ఎవరి లీడర్లకు మద్దతుగా వాళ్ల కామెంట్లు 
  • ముంబైలో కూటమి మీటింగ్.. పోస్టర్లు, ఫ్లెక్సీల్లోనూ వార్ 
  • కూటమిలో ఐక్యతపై అప్పుడే సందేహాలు   
  • ఇయ్యాల ఇండియా అలయెన్స్ లోగో విడుదల

ముంబై: ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరుండాలన్న దానిపై ఆయా పార్టీల నేతలు తలో మాట చెప్తున్నారు. ముంబైలో కూటమి థర్డ్ మీటింగ్ గురువారం ప్రారంభం కాగా, ఆ మీటింగ్ కు ముందు పలు పార్టీల నేతలు తమ లీడరే ప్రధాని అభ్యర్థిగా ఉండాలంటూ కామెంట్ చేశారు. అలాగే ముంబైలో ఆయా పార్టీలు తమ లీడర్లకు మద్దతుగా పోస్టర్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాయి. దీంతో కూటమిలో ఐక్యతపై అప్పుడే సందేహాలు నెలకొన్నాయి. ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికార ప్రతినిధి ప్రియాంక కక్కడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నే ఇండియా కూటమి తరఫున పీఎం క్యాండిడేట్ గా ప్రకటించాలన్నారు. దేశంలోని ప్రతి సమస్యపైనా ఆయన పోరాటం చేస్తున్నారని, ప్రధాని అభ్యర్థిగా ఆయనే కరెక్ట్ అని అన్నారు. 

అయితే, ప్రియాంక కామెంట్లను ఆ తర్వాత ఢిల్లీ మంత్రి ఆతిషి ఖండించారు. ఆ కామెంట్లు ఆమె వ్యక్తిగతమన్నారు. కేజ్రీవాల్ పీఎం రేసులో లేరని తాను అధికారికంగా చెప్తున్నానని స్పష్టం చేశారు. ఇక ఆప్ నేతలు కేజ్రీవాల్ ను కోరుకుంటే.. తాము తమ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ పీఎం అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటామని ఎస్పీ అధికార ప్రతినిధి జుహీసింగ్ అన్నారు. మరోవైపున శివసేన(యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా తమ లీడర్ ఉద్ధవ్ థాక్రేకు మద్దతుగా మాట్లాడారు. ఇండియా కూటమిలో ఆరుగురు సీఎంలు, సీనియర్ లీడర్లు ఉన్నా... ఉద్ధవ్ నే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్నారు.  

పోస్టర్లు, ఫ్లెక్సీల్లోనూ వార్ 

ప్రతిపక్షాల కూటమి మీటింగ్ సందర్భంగా ముంబై లో పోస్టర్ వార్ మొదలైంది. కూటమిలోని పార్టీలు తమ నేతలకు వెల్​కం చెప్తూ ఎయిర్ పోర్టు వద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. అలాగే మీటింగ్ జరుగుతున్న గ్రాండ్ హయత్ హోటల్ పరిసరాల్లో కూడా పోటాపోటీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే, ఆప్, కాంగ్రెస్, జేడీయూ నేతలు మాత్రం తమ లీడర్ నే పీఎం క్యాండిడేట్ గా ప్రకటించాలంటూ పోస్టర్లు, ఫ్లెక్సీలు వేశారు. ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ ఉండాలని ఆప్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉండాలని జేడీయూ, రాహుల్ గాంధీయే కరెక్ట్ అంటూ కాంగ్రెస్ నేతలు పోస్టర్లలో మద్దతు తెలిపారు. 

మరోవైపు గ్రాండ్ హయత్ హోటల్ ఎదురుగా శివసేన (షిండే) చీఫ్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తరఫున కూడా పోస్టర్లు వెలిశాయి. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రేతో షిండే ఉన్న ఫొటోలతో ఈ పోస్టర్లను వేశారు.  ‘‘నా శివసేనను కాంగ్రెస్ లా మారనివ్వబోను” అంటూ బాల్ థాక్రే గతంలో చెప్పిన మాటలనూ ఇందులో రాశారు. కాంగ్రెస్ తో చేతులు కలిపిన ఉద్ధవ్ థాక్రేకు కౌంటర్ గానే ఈ పోస్టర్లు వేసినట్లు చెప్తున్నారు. 

మా దగ్గర చాలా మంది ఉన్నరు: ఉద్ధవ్ 

ప్రతిపక్షాల కూటమిలో ప్రధాని అభ్యర్థులు చాలా మంది ఉన్నారని శివసేన(యూబీటీ) నేత, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. కూటమి మీటింగ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయేకు మాత్రం ప్రత్యామ్నాయ అభ్యర్థులే లేరన్నారు. కూటమిలోని పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయని, ప్రజలంతా తమ వైపే ఉన్నారన్నారు. 

రావణుడికి ఎక్కువ తలలుంటయ్: షిండే 

ప్రతిపక్షాల కూటమిలో ప్రధాని అభ్యర్థులు చాలా మంది ఉన్నారన్న ఉద్ధవ్ థాక్రే కామెంట్లపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కౌంటర్ ఇచ్చారు. ‘‘మోదీని ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసిపోయాయి. కానీ అగ్గితో చెలగాటమాడితే.. కాలిపోతారు” అని అన్నారు. ఎన్డీయేలో ప్రధాని అభ్యర్థిగా మోదీ ఒక్కరే ఉన్నారన్న దానిపై స్పందిస్తూ ‘‘రావణుడికి చాలా ఫేస్ లు ఉంటాయి. కానీ మేం శ్రీరాముడి ప్రజలం. మాకు ఒకే ఫేస్ ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. కాగా, అపొజిషన్ అలయెన్స్ కు ఎలాంటి ఎజెండా లేదని.. మోదీని గద్దె దింపడం ఒక్కటే ఆ కూటమి థీమ్ అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు.  

ఇయ్యాల లోగో విడుదల  

కూటమి సమావేశాల్లో శుక్రవారం ఉదయం ప్రతినిధుల గ్రూప్ ఫొటో సెషన్ ఉంటుంది. తర్వాత ఉదయం 10.30కు కూటమి లోగో ఆవిష్కరణ, సమావేశం ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత 3.30కు కూటమి నేతలు  ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. దీంతో కూటమి ఈ దఫా సమావేశాలు ముగుస్తాయి.

కూటమి సమావేశాలు షురూ 

ఇండియా కూటమి సమావేశాలు గురువారం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్​లో ప్రారంభమయ్యాయి. రెండు రోజులు జరిగే ఈ సమావేశాలకు 28 పార్టీల నేతలు, ఆరుగురు సీఎంలు, పలువురు మాజీ సీఎంలు హాజరయ్యారు. మొదటి రోజు సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు కూటమి నేతల అనధికారిక సమావేశం జరిగింది. తర్వాత ఉద్ధవ్ థాక్రే విందు ఇచ్చారు. సమావేశాలకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ మాజీ చీఫ్ లు సోనియా, రాహుల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బీహార్ సీఎం నితీశ్, బెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ మాజీ సీఎం లాలూ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ సహా మొత్తం 28 పార్టీలకు చెందిన 63 మంది నేతలు హాజరయ్యారు.  కాగా, కూటమిలోకి మహారాష్ట్రకు చెందిన మరో రెండు పార్టీలు చేరుతున్నాయని ఎంపీ అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు. దీంతో కూటమిలోని పార్టీల సంఖ్య 28కి పెరిగిందన్నారు.