దుబ్బాక పీఏసీఎస్ లో ​అవకతవకలపై ఎంక్వైరీ 

దుబ్బాక పీఏసీఎస్ లో ​అవకతవకలపై ఎంక్వైరీ 

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు:  దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)లో అవకతవకలకు సంబంధించి స్వాహా చేసిన పైసల రికవరీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత మూడేండ్లుగా ఎరువుల అమ్మకాలకు సంబంధించిన పైసలను సొసైటీ సీఈవో సొంతానికి వాడుకున్న విషయం ఇటీవలే బయటపడిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారులు లోతుగా ఎంక్వైరీ ప్రారంభించారు. దాదాపు రూ.34 లక్షలు సొసైటీ అకౌంట్​లో జమ కాలేదు. అయితే ఈ పైసలు వాడుకున్న విషయమే ఆలస్యంగా వెలుగులోకి రావడంపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సీఈవో అమ్మన లక్ష్మారెడ్డిని సస్పెండ్​ చేశారు. ఈ పైసల్లో  సొసైటీ సిబ్బంది పీఎఫ్​అమౌంట్​రూ.2.35 లక్షలు కూడా ఉన్నాయి. 

ప్యాడీ కమీషన్ పైసలూ మళ్లింపు 

దుబ్బాక సొసైటీ ఆధ్వర్యంలో అమ్మిన ఎరువుల పైసలను సొంతానికి వాడుకున్న సీఈవో .. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వడ్ల కొనుగోళ్ల ద్వారా వచ్చిన కమీషన్​ పైసలను మార్క్ ఫెడ్ కు చెల్లిస్తూ వచ్చాడు. మార్క్ ఫెడ్ నుంచి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకే ప్రతీ సీజన్లో వడ్ల కమీషన్​ పైసలు ఇలా మళ్లించేవాడు. ఇటీవల జరిపిన ఆడిట్ సందర్బంగా సొసైటీ ఖాతాలో డబ్బు నిల్వలేకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా ఈ బాగోతం బయటపడింది. మూడేండ్లలో  దాదాపు రూ.32 లక్షలతో పాటు, సొసైటీ సిబ్బంది పీఎఫ్​ పైసలు రూ.2.35లక్షలు కూడా సీఈవో అకౌంట్ లోకి వచ్చాయి. వాస్తవానికి సొసైటీ కి సంబంధించి ప్యాడీ కమీషన్, సిబ్బంది పీఎఫ్​ అమౌంట్లు వేరు వేరు అకౌంట్ల ద్వారా నిర్వహించాల్సి ఉన్నా వాటిని  వాడుకునే విషయంలో ఎలాంటీ తీర్మానం లేకుండానే సీఈవో దారి మళ్లించాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏటా ఆడిట్ నిర్వహిస్తున్నా గత మార్చిలో స్టాక్ లో తేడాలు రావడంతో అనుమానించి డిస్ట్రిక్ కో ఆపరేటివ్ ఆఫీసర్​ ఎంక్వైరీ చేపట్టారు. పైసలు మళ్లింపు నిర్ధారణ కావడంతో సీఈవో లక్ష్మారెడ్డిని సస్పెండ్​చేశారు. 2016 లో సబ్ స్టాఫ్ (తాత్కాలిక ఉద్యోగి)గా చేరిన లక్ష్మారెడ్డి 2018 నుంచి సొసైటీ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 

ఈ వ్యవహారంలో ఇంకెవరున్నారు?

దుబ్బాక పీఎసీఎస్ లో జరిగిన అవకతవకలపై సీఈవోను సస్పెండ్ చేసినా దీని వెనుక మరికొందరు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఈవో స్థాయి అధికారి ఒక్కడే రూ.34 లక్షల మేర చేతి వాటాన్ని ప్రదర్శించినా తెరవెనుక ఎవరి అండదండలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా వుంటే ఎంక్వైరీలో అక్రమాలు జరిగినట్టు తేలడంతో సీఈవోను సస్పెండ్ చేయడంతోపాటు స్టాట్యూటరీ ఎంక్వైరీని అధికారులు ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎంక్వైరీ ఆఫీసర్ ను నియమించారు. ఈ అవకతవకల్లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే అంశం విచారణానంతరం బయటపడే అవకాశం ఉంది. ఎంక్వైరీ ఆఫీసర్ రిపోర్ట్ ప్రకారం సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ లో చర్చించి చర్యలు తీసుకుంటామని, అవకతవకలకు పాల్పడినవారితోపాటు కుటుంబసభ్యుల ఆస్తులను జప్తు చేసైనా స్వాహా చేసిన పైసలు రికవరీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

ఆస్తులు జప్తు చేసైనా రికవరీ చేస్తాం

దుబ్బాక పీఎసీఎస్ లో జరిగిన అవకతవకలపై స్టాట్యూటరీ ఎంక్వైరీని ప్రారంభించాం. విచారణ నివేదిక అనంతరం ఈ వ్యవహారంతో సంబంధమున్న వారి నుంచి డబ్బు రికవరీ చేస్తాం. వారి వద్ద డబ్బులు లేకుంటే  కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఆస్తులనూ జప్తు చేస్తాం. సాధ్యమైనంత తొందరగా ఎంక్వైరీని చేసి రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటాం.
‌‌‌‌- చంద్రమోహన్ రెడ్డి, డిస్ట్రిక్  కోఆపరేటివ్​ఆఫీసర్​