- భర్త, అత్తింటివారిపై కేసు నమోదు
గంగాధర, వెలుగు : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాల్‌రావుపల్లికి చెందిన నాగారపు అలియాస్ నలువాల మమత(32) వరకట్న వేధింపులతో గడ్డి మందు తాగి, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై బి. వంశీకృష్ణ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట్ గ్రామానికి చెందిన నలువాల ఓదయ్య కుమార్తె మమతను, గోపాల్‌రావుపల్లికి చెందిన నాగారపు అనిల్‌కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. భర్త అనిల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం తరచూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవారని సమాచారం.
ఈ నేపథ్యంలో ఈ నెల 25న మమత గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్‌లోని అపెక్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఓదయ్య ఫిర్యాదు మేరకు భర్త, మామ, అత్త, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
