పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం : డీపీఆర్ఓ గౌస్

పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం :  డీపీఆర్ఓ గౌస్

ఖమ్మం టౌన్, వెలుగు :  పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచాలని డీపీఆర్ఓ ఎంఏ గౌస్ అన్నారు. డీపీఆర్ఓ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుస్తకాలు చదవడం వల్ల వ్యక్తిత్వం పెరుగుతుందన్నారు. చిన్నతనం నుంచే పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు పెంచాలని సూచించారు. 

పుస్తకాలు జ్ఞాన ధనాగారాలని, పుస్తకాలు లభించే గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయంలో ఉద్యోగార్దులకు అవసరమైన అన్ని పుస్తకాలు ఏర్పాటు చేశామని, అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు.  

అనంతరం టీచర్​ కటుకోజ్వుల రమేశ్​రచించిన మరో గ్రంథాలయ ఉద్యమం కవితను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. కరుణ కుమారి, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేవీఎస్ఎల్ఎన్. రాజు, కార్యదర్శి ఎండీ ఇమామ్, ఉద్యోగులు జె. భాస్కర్, సీహెచ్. శ్రీనివాస్, వి. అఖిల్, ఎం. రోహిత్, అధికారులు  పాల్గొన్నారు.