- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
వనపర్తి టౌన్, వెలుగు: మారుతున్న విద్యా విధానంలో విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రామన్ ఐఐటీ టాలెంట్ టెస్ట్ బహుమతి ప్రదానోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న తరానికి అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, విద్యను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు దేశానికి సేవలందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణ, సంస్కారం అలవరచుకోవాలని సూచించారు. రామన్ ఐఐటీ టాలెంట్ టెస్ట్‌ను నిర్వహించిన డి.రాములు యాదవ్‌ను చిన్నారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం టాలెంట్ టెస్ట్ విజేతలకు చిన్నారెడ్డి బహుమతులను అందించి ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ప్రజావైద్యశాల డైరెక్టర్ డా.మురళీధర్, సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, రాజేంద్ర ప్రసాద్ యాదవ్, బైరోజు చంద్ర శేఖర్ పాల్గొన్నారు.
