నా తప్పేమీ లేదు.. త్వరలో అన్ని విషయాలు చెప్త.. ‘సృష్టి’ కేసులో అరెస్టయిన డాక్టర్ నమ్రత వ్యాఖ్య

నా తప్పేమీ లేదు.. త్వరలో అన్ని విషయాలు చెప్త.. ‘సృష్టి’ కేసులో అరెస్టయిన డాక్టర్ నమ్రత వ్యాఖ్య

ఈ కేసులో నన్ను కావాలనే ఇరికించారు..
కస్టడీకి తీసుకొన్న పోలీసులు.. గాంధీలో వైద్య పరీక్షలు 
6 గంటల పాటు కొనసాగిన విచారణ 
చైల్డ్​ ట్రాఫికింగ్‌‌పై నోరు మెదపని నమ్రత

పద్మారావునగర్, వెలుగు : ‘‘నా తప్పేమీ లేదు.  త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తా’’ అని సృష్టి సరోగసీ, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్​ నమ్రత వెల్లడించారు. 5 రోజులపాటు పోలీస్​ కస్టడీకి  గురువారం సికింద్రాబాద్​ కోర్టు అనుమతివ్వడంతో పోలీసులు ఆమెను శుక్రవారం ఉదయం జైలు నుంచి గాంధీ దవాఖానకు తీసుకొచ్చారు.  వైద్య పరీక్షల అనంతరం బయటకు వస్తున్న నమ్రత మీడియాతో మాట్లాడారు. 

‘ఈ కేసులో నన్ను కావాలనే ఇరికించారు.. ఓ ఆర్మీ ఆఫీసర్​తప్పుడు ఆరోపణలతోనే నాపై కేసు పెట్టారు’ అని అన్నారు. గాంధీ దవాఖానలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత పోలీసులు నేరుగా ఆమెను సికింద్రాబాద్​ నార్త్ జోన్​ డీసీపీ ఆఫీసుకు తీసుకెళ్లి, విచారణ నిర్వహించారు. సరోగసీ, ఐవీఎఫ్,శిశువుల కొనుగోలు, విక్రయాలు, అనుమతి లేకుండా ఆసుపత్రి నిర్వహణ ఇలా.. పలు అంశాలపై ఆమెను పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. 

చైల్డ్​ ట్రాఫికింగ్, తదితర అంశాలపై నమ్రత నోరు మెదపలేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. నమ్రత ఏజెంట్లు, ఏపీలోని ఏఎన్ఎమ్‌‌లు, ఆశా వర్కర్ల పాత్రపై పోలీసులు ప్రశ్నించారు. ఒక్కో దంపతుల వద్ద ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారని పోలీసులు అడిగారు. విజయవాడ, వైజాగ్​, హైదరాబాద్​ సృష్టి ఫెర్టిలిటీ బ్రాంచీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ఏ-3, ఏ-6  నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

సృష్టి టెస్ట్​ ట్యూబ్ బేబీ సెంటర్​ కేసులో మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. కేసు దర్యాప్తు పురోగతికి అవసరమైన మరో ఇద్దరు నిందితులు ఏ-3 సి.కళ్యాణి అచ్చాయమ్మ(40), ఏ-6 ధనశ్రీ సంతోషి (38)ని కస్టడీకి ఇవ్వాలని  సికింద్రాబాద్ కోర్టును గోపాలపురం పోలీసులు ఆశ్రయించారు.  వాదనలు విన్న  న్యాయమూర్తి శుక్రవారం ఇద్దరిని 5 రోజులపాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.  వైజాగ్‌‌లోని సృష్టి బ్రాంచిలో మేనేజర్‌‌‌‌గా పనిచేస్తున్న ఏ-3 కళ్యాణి.. సృష్టి అక్రమ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు.  

అలాగే, అమీర్‌‌‌‌పేట్‌‌లో నివాసం ఉంటున్న అస్సాంకు చెందిన మధ్యవర్తి ఏ-6 ధనశ్రీ సంతోషి  స్పెర్మ్​, అండాలు, శిశువుల కొనుగోళ్లల్లో ముఖ్య పాత్ర పోషించినట్లు సమాచారం. వీరిద్దరి వద్ద రాజస్థాన్​ దంపతులకు సరోగసీ పేరున ఇచ్చిన బాబుకు సంబంధించిన సమాచారం పూర్తిగాఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు.  ఈ ఇద్దరిని గోపాలపురం పోలీసులు శనివారం ఉదయం చంచల్​ గూడ జైలు నుంచి తీసుకువచ్చి, కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.