- టీకాలతో కొన్ని క్యాన్సర్లను నివారించవచ్చు.. వీటిపై అవగాహన పెంచుతాం
- పద్మభూషణ్ అవార్డు బాధ్యతను పెంచిందన్న ప్రముఖ ఆంకాలజిస్ట్
- బసవతారకం ఆస్పత్రిలో రిపబ్లిక్ డే వేడుకలు
- కృత్రిమ స్వరంతో జనగణమన పాడిన క్యాన్సర్ సర్వైవర్స్
- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
హైదరాబాద్, వెలుగు: కొన్ని రకాల క్యాన్సర్లను టీకాలతో నివారించవచ్చని, అలాంటి వ్యాధులను నిర్మూలించడమే లక్ష్యంగా పని చేస్తానని ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మభూషణ్ విజేత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అన్నారు. నివారించదగ్గ క్యాన్సర్ వ్యాధులను తెలుగు రాష్ట్రాల నుంచి పూర్తిగా తుడిచిపెట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో జరిగిన వేడుకల్లో డాక్టర్ నోరి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ, నా దేశం, నా ప్రజలు.. నేను చేసిన సేవలు, పరిశోధనలను గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది” అని ఆయన చెప్పారు. ‘‘ఈ అవార్డు నాకు కేవలం గుర్తింపు మాత్రమే కాదు. ఇదొక చాలెంజ్. భవిష్యత్తులో క్యాన్సర్ వైద్య రంగాన్ని మన దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాలనే నా దృఢ సంకల్పానికి ఇది ఊతమిచ్చింది.
నేను ఇదే గడ్డపై పుట్టాను. ఇక్కడే సైకిల్ తొక్కిన వాడిని. రిక్షాలో తిరిగిన వాడిని. ఇక్కడి యూనివర్సిటీల్లోనే చదువుకున్నాను. ఇప్పుడు మళ్లీ నా తెలుగు ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇంతటి గొప్ప అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని డాక్టర్ దత్తాత్రేయుడు ఉద్వేగానికి గురయ్యారు.
సీఎంల సహకారంతో క్యాన్సర్ పై యుద్ధం
తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ నివారణకు తాను రూపొందించిన రోడ్ మ్యాప్‌కు ఆమోదం లభించిందని డాక్టర్ దత్తాత్రేయుడు తెలిపారు. ‘‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ నేను ఇచ్చిన ప్రణాళికను అంగీకరించారు. ప్రజల ఆరోగ్యం కోసం, క్యాన్సర్ వైద్యంలో అధునాతన మార్పులు తెచ్చేందుకు నాకు అవకాశం కల్పించారు. వారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ పద్మభూషణ్ ప్రోత్సాహంతో ఇకపై రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా” అని ఆయన తెలిపారు.
కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నిర్మూలించవచ్చని డాక్టర్ నోరి ధీమా వ్యక్తం చేశారు. ‘‘ముఖ్యంగా మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ ను వ్యాక్సినేషన్ ద్వారా అరికట్టవచ్చు. అలాగే హెపటైటిస్-–బీ వ్యాక్సిన్ ద్వారా లివర్ క్యాన్సర్లను నివారించవచ్చు. మనం చూస్తున్న క్యాన్సర్లలో 60-–70 శాతం పొగాకు వినియోగం వల్లే వస్తున్నాయి. వీటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా నివారించవచ్చు. ఈ దిశగా రెండు రాష్ట్రాల్లోనూ కార్యక్రమాలను వేగవంతం చేస్తాం. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్య ముఖచిత్రంలో అద్భుతమైన మార్పులు చూస్తాం’’ అని ఆయన వివరించారు.
క్యాన్సర్ బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నాం: బాలకృష్ణ
రిపబ్లిక్ డే సందర్భంగా బసవతారకం హాస్పిటల్ అరుదైన రికార్డు సాధించింది. క్యాన్సర్ కారణంగా స్వరపేటికను కోల్పోయిన 75 మందికి పైగా బాధితులు.. తమకు అమర్చిన కృత్రిమ స్వరపేటికల సహాయంతో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ అద్భుత ఘట్టానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్)లో చోటు దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల చేతుల మీదుగా ఈ రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్ ను హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ స్వీకరించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘గొంతు క్యాన్సర్ కారణంగా స్వరపేటికను తొలగించడం వల్ల మాట్లాడే శక్తిని కోల్పోవడం ఒక అంగవైకల్యం లాంటిది. అలాంటి వారు సామాజికంగా, మానసికంగా ఎంతో వివక్షను ఎదుర్కొంటారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు మా హాస్పిటల్ లో లారింజెక్టమీ క్లబ్ ఏర్పాటు చేశాం. ఈ రోజు వారు కృత్రిమ స్వరంతో జనగణమన పాడి దేశభక్తిని చాటుకోవడమే కాకుండా, వారిలో ఉన్న పట్టుదలను ప్రపంచానికి చాటారు’’ అని కొనియాడారు.
హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ హెచ్ఓడీ డా. ఎల్.ఎం. చంద్రశేఖర రావు మాట్లాడుతూ.. రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు, వారి పునరావాసం కోసం ఈ క్లబ్ ద్వారా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ఆన్ లైన్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. తాజాగా ప్రపంచ రికార్డు సాధించడం వారి ఐక్యతకు నిదర్శనమన్నారు.
