ఈ కాలానికి శస్త్రచికిత్స కవిత్వం

ఈ కాలానికి శస్త్రచికిత్స కవిత్వం

‘సాకీ’ కలం పేరుతో రచనలు చేస్తున్న కవి కొమిరె వెంకన్న. తన అక్షరాలతో ఈ సమాజానికి శస్త్ర చికిత్స చేయాలనుకునే ‘కలం వైద్యుడు’ సాకీ. కమ్యూనిస్టు శిబిరంలోనే యవ్వన కాలమంతా గడిపాడు. కానీ, అక్కడే ఆగిపోలేదు. సామాజిక న్యాయంవైపు అడుగులు వేశాడు. అదే అంబేద్కర్ వైపు నడిపించింది. దీంతో ఈ కవి దృక్పథంలోనే ఒక మార్పు వచ్చింది. ప్రతీ వెనుకబాటుకు ఈ దేశంలో కులమే అసలు రహస్యమని అతి తొందరలోనే గ్రహించాడు. గ్రహించడమే కాదు గొంతు సవరించుకున్నాడు. తనవంతుగా తన మైండ్‌‌లో జరుగుతున్న సంఘర్షణను అంతా ఉన్నది ఉన్నట్టుగా కవిత్వం చేస్తున్నాడు. అందుకే ఇది ఉద్యమ కవిత్వం. అది మూలవాసీ,  దళిత, బహుజన ఉద్యమం.

ఉద్యమకాలంలో వచ్చే కవిత్వంలో కవిత్వం పాలు తక్కువ అనేది నిర్వివాదాంశం. అందులో నినాద ప్రాయమైన కవిత్వం ఎక్కువగా వస్తుంది. అందుకు ఏ ఉద్యమం కూడా మినహాయింపు కాదు. సాకీలో ఒక ఉద్యమకారుడు ఉన్నప్పటికీ ఒక హృదయాంతరాలంలో సంఘర్షించే కవీ దాగి ఉన్నాడు. అందుకే తాను ప్రతీ అలజడిని, ఆందోళనను కవిత్వంగా ప్రవహింపజేశాడు. ఈ కవి విజయమంతా అతని దృక్పథంలోని దృక్కోణంలోనే ఉంది. సమాజ చలన సూత్రాన్ని అర్థం చేసుకోలేని కవి ఒక సంఘటన మూలాన్ని పట్టుకోలేడు. కానీ, సాకీ మాత్రం ప్రతీ వర్తమాన సంఘటనకు చారిత్రక మూలాలను వెతికాడు. ఇదిగో ఇది అసలు కారణం అంటూ మనువాద బ్రాహ్మణీయ శక్తుల గుట్టు రట్టు చేశాడు. అందుకే ఇట్లా మూలవాసీ దృష్టికోణంతో ఈనాటి బహుజన ఉద్యమానికి అవసరమైన కవిత్వాన్ని వెలువరించాడు. 

“నాకు చావు లేదు
నేను ఈ దేశ మూలవాసిని
ఈ దేశానికి పాలించడం నేర్పిన
మొట్టమొదటి పరిపాలకుణ్ణి నేను
నేను ఈ దేశ మహాదిగ మానువుణ్ణి
నేను మా తాత జాంబవంతుని
రక్తమాంసాన్ని
రేపు ఎర్ర కోట బురుజులపై 
రెపరెపలాడే ‘ఆత్మగౌరవ జెండా’ నేను” (ఆత్మగౌరవ జెండా) 

అంటూ కవిత్వంలో ఆత్మగౌరవ జెండాను ఎత్తాడు. చాలామంది దళిత, బహుజన కవుల్లో లోపించిన దృష్టికోణం. తన మూలాలను తాను తడుముకునే ప్రయత్నం ఈ కవిత్వం నిండా పరుచుకొని ఉంది. అందుకే ఇది మూలాల అన్వేషణ కవిత్వం.

“బుద్ధుణ్ని హత్తుకుందాం” కవితలో ఆయా సందర్భాలకు ఎవరి అవసరం ఉంటే వారిని అనుసరిద్దామనే ఫ్లెక్సిబిలిటీ ఈ కవిలో ఉంది. ఇది ఒక రకంగా బలం, మరో రకంగా బలహీనత. రిజిడ్‌‌గా ఒంటెద్దు పోకడతో తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లనే వాదన తనలో లేకపోవడం బలం. ఏదో ఒక మార్గానికి పరిమితం కాకపోవడం ఇతని బలహీనత. ఈ రకమైన పరిణామానికి కాలమే కారణం. 

సాకీ కవిత్వంలో మూలవాసీ తాత్విక భూమిక ఉంది. కులాన్ని, కులాన్ని పుట్టించిన కుతంత్రాల మీద మంటై మండుతున్నాడు. బహుజనుల జీవితాల్లో చీకట్లు నింపిన దుర్మార్గాలను దునుమాడుతున్నాడు. ఇది దళిత సాహిత్యం అందించిన చూపు. ఈ చూపుతో తన వంతు గొంతు కలుపుతున్నాడు. 

నిజానికి చదువుతోటే బతుకు మారుతదని కమ్యూనిజం ఏనాడు చెప్పలేదు. విప్లవం ద్వారానే బతుకులు బాగుపడతాయని బోధించింది. ఆ మాటను నమ్మి అనేకమంది బహుజనులు తమ జీవితాలను తృణప్రాయంగా ధారపోశారు. చదువులకు, ఉద్యోగాలకు దూరమయ్యారు. దీంతో కడుపేదరికంలోకి నిర్ధాక్షిణ్యంగా నెట్టివేయబడ్డారు. ఈ కవి మాత్రం ఆఫ్రికా నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా చెప్పినట్టు చదువే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని నమ్ముతున్నాడు. ఈ సమాజాన్ని మూలవాసీ తాత్విక దృక్పథంతో దర్శిస్తాడు అనడానికి ఇందులో అనేక కవితలు దర్శనమిస్తాయి.

“నీకు ఎక్కడ మట్టివాసన 
పరిమళాలు కనిపించినా
అవి నా జాతి మూలాల తాలూకు 
అడుగుజాడలే” 

అంటాడు పునాదిరాళ్లు అనే కవితలో. ఇది సంపద సృష్టికర్తలైన మూలవాసుల పట్ల ఈ కవికి ఉన్న ఎనలేని ప్రేమకు చిహ్నం. నిజానికి స్వార్థ చింతన లేని, కుట్రలు కుతంత్రాలు లేని ప్రాచీన సమాజ లక్షణం ఇంకా మూలవాసుల్లో బతికి ఉంది. డొల్లపూరితమైన దోపిడీ నాగరికత వికసించినకొద్దీ స్వార్థం ప్రతీ గడపకు, ప్రతీ కంటికీ చేరుతుంది. అందుకే సాకీ తన జాతి బిడ్డల త్యాగాలను, నిస్వార్థ సేవను గుర్తు చేస్తూ వారిని గౌరవిస్తున్నాడు.

“నీకు ఎక్కడైనా ప్రకృతి ఓ అందమైన
దృశ్యకావ్యంగా మెరిసినా
అది నా జాతి జానపద జనజీవన
సౌందర్యానికి ప్రతి రూపమే...!

నీవు ఎక్కడున్నా అనుకోని వరంలాగా
ఒక మంచి స్నేహితుడు దొరికినాడా...?
ముమ్మాటికి అది నా జాతి పునాదిరాయి
ప్రేమతత్వ గీతమే...!” 

(పునాదిరాళ్లు) అంటాడు. 
ఇట్లా మూలవాసీ జాతిని గురించి ఇంతకంటే గొప్పగా ఏం చెప్పగలం. తాను ఎదిగి వచ్చిన జాతిని గురించి తలుచుకోకుండా ఏ కవి కవిత్వం రాయలేడు. తన తల్లి గురించో, ఊరి గురించో కలవరించకుండా ఎలా ఉండగలడు? తన జాతి ఔన్నత్యాన్ని గురించి తలచుకొని తన్మయత్వం చెందుతున్నాడు సాకీ. ఇది మూలవాసీ కల్చర్. గొప్ప సాంస్కృతిక మూలాలు కలిగిన జాతిలో పుట్టినప్పటికీ చాలామంది మూలవాసులకు ఈ చరిత్ర తెలియదు. అందుకే వారు ఈ కులంలో కాకుండా మరో కులంలో పుడితే బాగుండు అని పలాయనం చిత్తగిస్తారు. ఈ జాతి గొప్పతనం తెలిస్తే గుండెల నిండా గర్వంతో అవును నేను ఈ దేశ మూలవాసుల వారసుణ్ణి అని గర్జిస్తాడు. ఇప్పుడు సాకీ చేస్తున్న పని అదే. 

అసురుడే అసలైన విప్లవయోధుడు అంటున్నాడు సాకీ. ఈ మాట అనడానికి చాలామంది అగ్రవర్ణ కమ్యూనిస్టులకు ధైర్యం చాలదు. సాకీ మాత్రం మూలవాసుల పోరాటాలకు, ఆరాటాలకు పట్టం కడుతున్నాడు. కులదృక్పథంతో సమాజాన్ని పరిశీలిస్తున్నాడు. వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రకోపిస్తున్నాడు.

“అప్పుడు.. ఇప్పుడూ..
ఎప్పుడైనా.. బతుకు ఆరాటం నాదే!
బందూ‘కుల’పోరాటం నాదే” 

అంటాడు ‘ఆత్మబలిదానం’ అనే కవితలో. ఇది చేదు నిజం. నగ్నసత్యం. భారతదేశ పోరాటాల చరిత్రలో చిందిన నెత్తురంతా కింది కులాలదే. అక్కడక్కడ ఒకరిద్దరు పెద్దకులాల నాయకులు కూడా ఎప్పుడో చుక్క తెగిపడ్డట్టు నేలరాలొచ్చు. కానీ, ఏ ఉద్యమ చరిత్ర తీసినా అందులో కింది కులాల అమరత్యాగం దాగి ఉంటుంది. ఆ లెక్క తీయాలి. ఆ చావులను లెక్కించాలి. అప్పుడుగానీ, ఎవరు నిజాయితీగా ప్రాణాలు ధారపోశారో తెలుస్తుంది. అందుకే ఈ కవితలో సాకీ అంటున్నట్టు బందూకుల పోరాటంలో బలైపోయింది నేనే అనడం వ్యక్తిగతం కాదు, అది కింది కుల ప్రాతినిధ్య స్టేట్‌‌మెంట్. 

“ఈ దేశంలో మార్క్సిజం
కులం తారుడబ్బాలో
ముంచి తీసిన తెల్లని
పావురంలా ఉంది
ఇప్పుడీ నల్ల పావురానికి 
వేరే మార్గం లేదు
కాకి బలగంతో కలిసి
కోకిల రాగం తీయాల్సిందే
మనువు వ్యాధికి మందులేదు
మానవత్వం మర్మాంగంపై పుట్టిన
కులం రాచపుండు కురుపును
శస్త్ర చికిత్స చేసి తొలగించాల్సిందే”

 అని కమ్యూనిజానికి పట్టిన క్యాస్ట్ వైరస్‌‌కు ట్రీట్‌‌మెంట్ అవసరం అంటాడు. ఇందుకే సాకీ రాజకీయ కవి. తాను ఎదిగి వచ్చిందే కమ్యూనిజం నుండి. అయినా సరే దానిలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికి ఏ మాత్రం వెనకాడకపోవడం ఇతని నిజాయితీని తెలియజేస్తున్నది. అందుకే కమ్యూనిస్టులకు పట్టిన రాచపుండులాంటి కులం కురుపును తొలగించాలంటున్నాడు.

ఇంత సాహసోపేతమైన దిశానిర్ధేశాన్ని ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా అంగీకరించదు. అందుకు కారణం వారికి పట్టింది కరోనా వైరస్ కాదు, క్యాస్ట్ వైరస్. ఆ క్యాస్ట్ వైరస్‌‌ను వదిలించుకొమ్మని అగ్రవర్ణ కమ్యూనిస్టు నాయకులందరికీ సాకీ ఈ కవిత్వంలో చురకలు అంటిస్తున్నాడు. కానీ సాకీకి అమరత్వం, త్యాగమయుల వీరత్వం మీద ఆ కవికి ఎనలేని గౌరవం ఉంది. అందుకే వారి త్యాగాలను గానం చేస్తున్నాడు. సామాజిక ప్రేమ కలిగిన వ్యక్తిత్వాలను గుండెలకు హత్తుకుంటున్నాడు. 

అలాగే ఈ కవిత్వంలో గొప్ప భరోసా లక్షణం ఉంది. కష్టాల్లో నలిగిన జీవితం నుండి గొప్ప ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రకటించడం అంటే మాటలు కాదు. ఈ కవిలో అది మెండుగా ఉంది. ఎంత నైరాశ్యం వెంటాడినా తప్పక ఏదో ఒకరోజు గెలుస్తానని, తన గురించి తాను చెప్ప్పుకున్నా అది పాఠకుల్లో కూడా గొప్ప భరోసాను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఏ ప్రగతిశీల కవైనా చేయాల్సిన పనే ఇది. నిరాశనిస్పృహల్లో ఉన్న తన జాతులకు గొప్ప గుండె ధైర్యాన్ని తన అక్షరాల చేత అందించినపుడే ఏ సాహిత్యానికైనా సార్థకత.
సాకీ కవిత్వంలో మరొక ముఖ్యలక్షణం విలువల బేరీజు. సాకీకి విలువలు లేకుండా బతికే మనుషులన్నా, పాలకులన్నా యమకోపం. అందుకే సందుదొరికినప్పుడల్లా వారిని ఏదో ఒక విధంగా తిరస్కరిస్తున్నాడు.     

- డా.పసునూరి రవీందర్
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత

Note: లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com