సాధారణంగా టాలీవుడ్ నటుడు రవిబాబు సినిమా వస్తోందంటే చాలు.. అందులో ఏదో ఒక వెరైటీ కాన్సెప్ట్ ఉంటుంది. మన ఊహకు అందని వింతైన పాత్రలు ఖచ్చితంగా ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు. తనదైన హారర్, కామెడీ జానర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ క్రియేటివ్ డైరెక్టర్, ఈసారి తన రూట్ మార్చారు. పక్కా యాక్షన్-సర్వైవల్ జోనర్‌లో చేసిన లేటెస్ట్ మూవీ 'రేజర్' (Razor). ఈ చిత్రం ఈ రోజు ( మే 8, 2026 ) రిలీజ్ అయింది. మరి ఈ రక్తపాతంతో నిండిన 'రేజర్' బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు మెప్పించిందో చూపించిందో ఇప్పుడు చూద్దాం..
కథేంటంటే..
విష్ణు (తనీష్) సీసీటీవీ కెమెరాల బిజినెస్ రన్ చేస్తుంటాడు. అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో, విష్ణు అమర్చిన ఒక సీసీ కెమెరాలో స్టేట్ చీఫ్ మినిస్టర్ సీతారామయ్య (రామరాజు) దారుణ హత్యకు గురైన దృశ్యాలు రికార్డ్ అవుతాయి. ఈ దారుణానికి ఒడిగట్టింది మరెవరో కాదు.. సీఎం పీఠంపై కన్నేసిన హోం మినిస్టర్ కనకరాజు (వీరన్న చౌదరి). ఈ సాక్ష్యం ఎక్కడ బయటపడుతుందోనని కనకరాజు గ్యాంగ్ విష్ణుని చంపేస్తుంది. చనిపోయే ముందు విష్ణు ఆ వీడియో క్లిప్‌ను త్రీ-లేయర్ పజిల్‌గా మార్చి, తన చిన్నారి కూతురు తేజు (బేబీ తేజల్ విద్యాతి) బొమ్మలో దాచేస్తాడు. కళ్ల ముందే తండ్రిని కోల్పోయి, హోం మినిస్టర్ గూండాల బారిన పడ్డ ఆ పాపను కాపాడటానికి రుద్ర ప్రతాప్ అలియాస్ రేజర్ (రవిబాబు) అనే మొబైల్ పెట్ గ్రూమర్ ఎంటర్ అవుతాడు. అస్సలు ఈ రేజర్ వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? ఆ రౌడీల వేట నుండి ఆ చిన్నారిని అతను ఎలా కాపాడాడు? అన్నదే మిగిలిన కథ.
యాక్షన్ అదిరింది.. కానీ!
సినిమా స్టార్టింగ్ 15 నిమిషాల్లోనే అసలు కథలోకి వెళ్ళిపోయి హైప్ క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రవిబాబు తన భారీ కటౌట్‌కు తగ్గట్టుగా చేసిన యాక్షన్ సీక్వెన్సులు, ముఖ్యంగా గ్యారేజ్ ఫైట్ సీన్ థియేటర్లలో ఈలలు వేయిస్తుంది. బూడిద రంగు థీమ్‌తో సాగే సినిమాటోగ్రఫీ, క్వాలిటీ విజువల్స్ అబ్బురపరుస్తాయి. అలాగే చిన్నారి తేజు పాత్రలో నటించిన పాప ఎమోషనల్‌గా బాగా చేసింది.
లాజిక్ మిస్..
అయితే, రవిబాబు నుంచి ప్రేక్షకులు ఆశించే ఆ లాజిక్ అండ్ మేజిక్ ఈ సినిమాలో చాలా చోట్ల మిస్ అయ్యాయన్న అభిప్రాయం సినీ ప్రియుల్లో వ్యక్తం అవుతోంది. ఒక పక్క రాష్ట్రమంతా చిన్నారి కోసం పోలీసులు గాలిస్తుంటే, వారు అంత ఈజీగా దొరకకపోవడం కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. సినిమాను భారీ రక్తపాతం, నరకాలతో నింపేశారు. కనుగుడ్లు పీకడం, తలలు నరకడం వంటి 'కిల్', 'మార్కో' తరహా వైల్డ్ యాక్షన్ సీన్స్ ఉండటంతో ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు అన్న టాక్ వినిపిస్తోంది..
కాస్త ల్యాగ్ గా..
ఫస్టాఫ్ వేగంగా సాగినా.. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ అంత బలంగా అనిపించదు. హీరో వేదన వెనుక ఉండాల్సిన ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం సినిమాకు మైనస్ గా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైగా గంభీరమైన సన్నివేశాలలో కూడా రవిబాబు డైలాగ్ డెలివరీ కొన్ని చోట్ల నవ్వు తెప్పిస్తుంది. రాజేష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించినా, స్క్రీన్ ప్లే ఊహాజనితంగా మారడంతో సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. సత్యానంద్ స్క్రీన్ ప్లే మొదల్లో బాగానే ఉన్నా.. సెకండాఫ్ లో పట్టు కోల్పోయిందన్న భావన కలుగుతుందన్న టాక్ వినిపిస్తోంది.
యాక్షన్ లవర్స్‌కు, ముఖ్యంగా రవిబాబు వైల్డ్ అవతార్‌ను చూడాలనుకునే వారికి 'రేజర్' ఒక ఓకే అనిపించే డార్క్ యాక్షన్ డ్రామా. కాస్త లాజిక్కులు పక్కన పెట్టి, హెవీ వయొలెన్స్‌ను భరించగలిగితే థియేటర్లలో ఈ వీకెండ్ ట్రై చేయొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాకు నిర్మాతలుగా రవిబాబు, దగ్గుబాటి సురేష్ బాబు వ్యవహారించారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి మరి.
