
హైదరాబాద్: నిమ్స్ కొత్త డైరెక్టర్ గా డాక్టర్ రామ్మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నిమ్స్ డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ కె.మనోహర్ సెలవుల్లో ఉన్నారు. ఆయన స్థానంలో నిమ్స్ డీన్ గా పని చేస్తున్న డాక్టర్ రామ్మూర్తికి నిమ్స్ డైరెక్టర్ గా అడిషనల్ ఛార్జ్ ఇస్తూ నిమ్స్ ఎగ్జిగ్యూటివ్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు ఇచ్చారు.
కాగా.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ ఇటీవల గుండెనొప్పితో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే నిమ్స్ డైరెక్టర్ గా ఉండి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు వెళ్లడం ఏంటనే దానిపై తీవ్ర వివాదం చెలరేగింది. నిమ్స్ ప్రతిష్టను డాక్టర్ మనోహర్ దిగజారుస్తున్నారని ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల నాయకులు కూడా ఈ విషయమై తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డా.మనోహర్ ను సెలవుపై పంపి కొత్త డైరెక్టర్ ను నియమించినట్లు వార్తలు వస్తున్నాయి.