ఆసిఫాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంలో కార్యకర్తలే కీలకమని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, పార్టీ ఆసిఫాబాద్ జిల్లా అబ్జర్వర్ డా.రియాజ్ అన్నారు. జిల్లాలో పార్టీని మరింత విస్తరించేందుకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా కార్యవర్గ విస్తరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డీసీసీ ప్రెసిడెంట్ సుగుణతో కతలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పట్ల నిబద్ధత, అనుభవం, ప్రజాసేవ దృక్పథం కలిగిన వారిని గుర్తించి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. అనంతరం సుగుణ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే కాంగ్రెస్ నాయకుల బాధ్యత అన్నారు. వ్యక్తుల కోసం కాదని, పార్టీ కోసం పనిచేసే వారికే కార్యవర్గంలో స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.
సామాజిక సమతుల్యత పాటిస్తూ సీనియర్ నాయకులతో పాటు యువత, మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇస్తూ కొత్త జిల్లా కార్యవర్గాన్ని రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గం ఇన్చార్జ్ అజ్మీర శ్యాంనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
