
హైదరాబాద్, వెలుగు: ‘ఆర్థిక క్రమశిక్షణ ఉండాలంటూ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నరు. కమీషన్ల కోసం భారీ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఈ సోయి లేదా? వందల కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టినప్పుడు, కార్లు, బస్సులు కొన్నప్పుడు, అసెంబ్లీ, సెక్రటేరియట్ కడతానన్నప్పుడు గుర్తుకురాలేదా?’ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. దుబారా ఖర్చుకు మారు పేరు కేసీఆర్ అని విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో విలేకరులతో శ్రవణ్ మాట్లాడారు. ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు. రూ. 3.50 లక్షల కోట్లు అప్పులు చేసినా ఉత్పాదక రంగంలో ఏం సాధించలేదన్నారు. ఆరేండ్లల్లో కేసీఆర్ సాధించింది ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.22 వేల కోట్లకు పెంచుకోవడమేనని.. ప్రజల రక్తమాంసాలను పీల్చి ఈ ఆదాయాన్ని సాధిస్తున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి సహా అనేక హామీలను అమలు చేయకుండానే 2018 ఎన్నికల్లో కొత్తగా 24 హామీలిచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా నిరుద్యోగులున్నారని, వారికి నిరుద్యోగ భృతి ఎందుకివ్వడం లేదని శ్రవణ్ ప్రశ్నించారు. ఆరేండ్లల్లో గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు ఇవ్వని సన్నాసి ప్రభుత్వం ఇదేనన్నారు.
పైనున్న మారాజే లంచాలు తీస్కుంటుంటే..
మహిళలపై వేధింపుల్లో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తోందని, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందని శ్రవణ్ అన్నారు. ఒక్క కేసులో నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేశారని, అలాంటి కేసులు ఇంకా 15 వరకు ఉన్నాయని చెప్పారు. ఏ గవర్నమెంట్ ఆఫీసుకు పోయినా లంచం లేకుండా పని కావట్లేదని, పైనున్న మారాజే లంచాలు తీసుకుంటే కింది స్థాయిలో ఇట్ల కాక ఇంకెట్ల ఉంటుందన్నారు. 6 వేల మంది రైతులు చనిపోతే ఆ కుటుంబాలను పట్టించుకున్న పాపానపోలేదని, డెంగీ మహమ్మారి ప్రజలను పొట్టనబెట్టుకుంటే కనీసం రివ్యూ చేయలేదన్నారు. సీఎం వైఖరితో 30 మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతే సరైన శిక్షణ లేని డ్రైవర్లు బస్సులు నడిపి ప్రమాదాల్లో మరో 30 మంది మరణాలకు కారకులయ్యారన్నారు. హంతకులే సంతాప సభ పెట్టినట్టు ఆయనే పిలిచి బిర్యానీ, భోజనాలు పెట్టి కార్మికులను మభ్య పెడుతున్నారని అన్నారు.