
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) లో కీలక అధికారి అయిన డాక్టర్ వినయ్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. పదవిచేపట్టిన మూడు నెలల్లోపే ఆయన ఈ ఉన్నత స్థానం నుంచి వైదొలగడం చర్చనీయాంశం అయింది. సరెప్టా థెరప్యూటిక్స్ డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ చికిత్సకు ఉపయోగించే ఎలెవిడిస్ అనే జన్యు చికిత్సకు సంబంధించి తలెత్తిన వివాదం కారణంగా డాక్టర్ వినయ్ ప్రసాద్ రాజీనామా చేశారు.
సరెప్టా తయారుచేసిన ఎలెవిడిస్ ఔషధాన్ని డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన ,ప్రాణాంతక జన్యు వ్యాధికి చికిత్సకు ఉపయోగాస్తారు. అయితే ఈ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ డేటా అసంపూర్తిగా ఉందని, దీని ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ ప్రసాద్ మొదటి నుంచి వ్యతిరేకించారు. జనవరి 2025 లో ఎలెవిడిస్ క్లినికల్ ట్రయల్స్ నుండి కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చాయి.ఇది ఔషధం సమర్థతపై అనుమానాలు రేకెత్తించింది కూడా.
మార్చి 2025 లో ఎలెవిడిస్ అందుకున్న ఇద్దరు రోగులు, ఒకరు బ్రెజిల్‌లో, మరొకరు USలో మరణించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వీరి మరణాలకు తీవ్రమైన కాలేయ వైఫల్యం కారణం అని తెలుస్తోంది. జూలై 2025లో FDA సరెప్టాను ఎలెవిడిస్ సరఫరాను నిలిపివేయాలని కోరింది. రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నష్టాల కంటే ప్రయోజనాలు తక్కువగా ఉన్న ఉత్పత్తులను అనుమతించబోమని డాక్టర్ ప్రసాద్ నొక్కి చెప్పారు. అయితే మధ్యలో అనూహ్యంగా FDA తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, కొన్ని రకాల రోగులకు ఎలెవిడిస్ సరఫరాను తిరిగి ప్రారంభించడానికి అనుమతించింది.దీంతో వివాదం తలెత్తింది.
డాక్టర్ వినయ్ ప్రసాద్ స్థానం
డాక్టర్ ప్రసాద్ ఎలెవిడిస్ ను ఆమోదించడంపై తీవ్రంగా విమర్శించారు. ఈ ఔషధాన్ని తొందరపడి ఆమోదించారని, సరిపడా ఆధారాలు లేవని, ఇది పిల్లల మరణాలకు, కాలేయ సమస్యలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా FDA లోని ఇతర అధికారులు ఎలెవిడిస్‌ను ఆమోదించడానికి వ్యతిరేకించారు.అయితే వారి అభిప్రాయాలను ఉన్నతాధికారులు తోసిపుచ్చారు.
రాజీనామాకు కారణాలు
ఎలెవిడిస్ ఆమోదానికి సంబంధించి డాక్టర్ ప్రసాద్ వ్యతిరేకించినా, మరణాలు సంభవించిన తర్వాత కూడా ఔషధాన్ని తిరిగి మార్కెట్‌లోకి అనుమతించడం వంటి FDA నిర్ణయాలు ఆయనకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.డాక్టర్ ప్రసాద్ నియామకంపై కొన్ని రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, కోవిడ్-19 వ్యాక్సిన్ విధానాలపై ఆయన అభిప్రాయాలు వివాదాస్పదమయ్యాయి. కొందరు ఆయనను ప్రగతిశీలవాది అని, ట్రంప్ పరిపాలనను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
FDA పనితీరుపై దృష్టి: డాక్టర్ ప్రసాద్ రాజీనామా చేస్తూ, తాను FDA గొప్ప పనికి ఆటంకం కలిగించకూడదని నిర్ణయించుకున్నానని..తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి కాలిఫోర్నియాకు తిరిగి వెళ్లాలని డాక్టర్ ప్రసాద్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
డాక్టర్ వినయ్ ప్రసాద్ రాజీనామాతో..
డాక్టర్ వినయ్ ప్రసాద్ రాజీనామా FDA లోపల డ్రగ్ ఆమోద ప్రక్రియల పారదర్శకత, శాస్త్రీయ ఆధారాల ప్రాముఖ్యతపై తీవ్ర చర్చకు దారితీసింది. ఇది జన్యు చికిత్సలు, ముఖ్యంగా అరుదైన వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాల ఆమోదం విషయంలో FDA ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా హైలైట్ చేసింది.
ఈ వివాదం సరెప్టా ,FDA మధ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపింది. సరెప్టా మొదట్లో FDA అభ్యర్థనను వ్యతిరేకించినప్పటికీ, తరువాత ఎలెవిడిస్ సరఫరాను నిలిపివేయడానికి అంగీకరించింది. అయితే కొన్ని రోజుల తర్వాత FDA స్వయంగా తిరిగి అనుమతించింది. ఈ పరిణామాలు డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ కమ్యూనిటీపై తీవ్ర పరిణామాలు చూపే అవకాశం ఉంది.