యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'డ్రాగన్' (Dragon). భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఈ చిత్రం గురించి లేటెస్ట్ గా ఒక భారీ అప్‌డేట్ బయటకొచ్చింది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ చిత్రంలో భాగమైనట్లు స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు.
హైప్ పెంచేసిన అప్‌డేట్
గత కొన్ని రోజులుగా అనిల్ కపూర్ ఈ సినిమాలో విలన్‌గానో లేదా కీలక పాత్రలోనో నటించబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వీటికి క్లారిటీ ఇస్తూ అనిల్ కపూర్ ఇన్‌స్టాలో ఒక స్టోరీ పెట్టారు. "ఒక సినిమా షూటింగ్ పూర్తయింది (వార్ 2), మరో రెండు లైనప్‌లో ఉన్నాయి" అంటూ డ్రాగన్ సినిమా పోస్టర్‌ను ట్యాగ్ చేశారు. తారక్ - అనిల్ కపూర్ కాంబినేషన్ ఇప్పటికే బాలీవుడ్ మూవీ 'వార్ 2' లో నటించారు. ఇప్పుడు 'డ్రాగన్' రూపంలో రెండోసారి ఈ ఇద్దరు దిగ్గజాలు స్క్రీన్ పంచుకోబోతున్నారు.
డ్రాగన్ టీంలోకి మరికొందరు స్టార్లు?
అనిల్ కపూర్‌తో పాటు ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరోలు టొవినో థామస్, బీజు మీనన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ తన 'సలార్' సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఎలాగైతే అద్భుతంగా చూపించారో, ఈ చిత్రంలో కూడా ఇతర భాషల నటులను పవర్‌ఫుల్ రోల్స్‌లో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక 'కాంతార' ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా తారక్ సరసన సందడి చేయనుంది.
18 కిలోల బరువు తగ్గిన తారక్ !
ఈ చిత్రం కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తారక్ దాదాపు 18 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. 'దేవర'లో మాస్ లుక్‌లో అలరించిన తారక్, ప్రశాంత్ నీల్ విజన్‌లో చాలా స్లిమ్‌గా, మునుపెన్నడూ చూడని అత్యంత రఫ్ అండ్ రా (Raw) లుక్‌లో కనిపించబోతున్నారు. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ కానుంది.
రిలీజ్ ఎప్పుడు?
మైత్రీ మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే విదేశాల్లోని కొన్ని లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకోనుంది. అనిల్ కపూర్ కూడా త్వరలోనే సెట్స్ లో జాయిన్ కానున్నారు. 'వార్ 2' తర్వాత వచ్చే ఈ భారీ పాన్ ఇండియా ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల డ్రాగన్‌గా మారుతుందేమో చూడాలి!
