ఒప్పందాలకు డ్రాగన్ కట్టుబడి ఉంటలే

ఒప్పందాలకు డ్రాగన్ కట్టుబడి ఉంటలే

శావో పౌలో(బ్రెజిల్): చైనాతో బార్డర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. బ్రెజిల్ పర్యటనలో భాగంగా ఆదివారం శావో పౌలో సిటీకి చేరుకున్న ఆయన.. ఇండియన్ కమ్యూనిటీతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం చైనా, ఇండియా మధ్య సంబంధాలు చాలా క్లిష్టమైన దశలో సాగుతున్నాయని తెలిపారు. ‘‘రెండు దేశాలూ 1990లలో కుదుర్చుకున్న బార్డర్ ఒప్పందాల ప్రకారం.. ప్రొహిబిటెడ్ ఏరియాల్లో భారీగా బలగాలను మోహరించరాదు.

కానీ చైనా ఈ ఒప్పందాలను తుంగలో తొక్కుతోంది. గల్వాన్ లోయలో ఏం జరిగిందో మీకందరికీ తెలుసు. ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు” అని వెల్లడించారు. ‘‘వాళ్లు మన పొరుగోళ్లు. వ్యక్తిగతంగా, దేశం పరంగా ప్రతి ఒక్కరూ పొరుగోళ్లతో కలిసి ముందుకు సాగాలని కోరుకుంటారు. కానీ రెండు వైపులా గౌరవం ఉన్నప్పుడే ఆ రిలేషన్ షిప్ బాగుంటుంది. లేకపోతే అది వన్ వే స్ట్రీట్ గా మారుతుంది” అని అభిప్రాయపడ్డారు. కాగా, బ్రెజిల్ పర్యటన తర్వాత పరాగ్వే, అర్జెంటినా దేశాల్లోనూ జైశంకర్ పర్యటించనున్నారు.