
- చిన్న వానకే ఆగమైన స్మార్ట్ సిటీ
- వరద నీటితో రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
- ప్లానింగ్ లోపమే కారణం అంటున్న నగరవాసులు
కరీంనగర్, వెలుగు: కొద్దిపాటి వర్షం కురిసినా కరీంనగర్‌లోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన రోడ్లను సరైన ప్లానింగ్‌తో నిర్మించకపోవడంతో బ్లాక్ అవుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కురిసిన చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ నీళ్లు పోటెత్తి కలెక్టరేట్ ను ముంచెత్తాయి. కలెక్టరేట్ హెలీ ప్యాడ్ గ్రౌండ్ నుంచి పోయే మురుగు కాలువ వర్షానికి ఉప్పొంగింది. దీంతో అక్కడి హెలీప్యాడ్ పార్కులోకి పోటెత్తిన మురికి నీళ్లు.. కలెక్టర్ ఆవరణలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్, డీపీఆర్వో కార్యాలయం, ఎస్ బీఐ, రెవెన్యూ క్వార్టర్స్ లోకి చేరాయి. ఇక్కడే ఉన్న కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి మండలాల తహసీల్దార్ కార్యాలయాల ముందు నిలిచే వరద ఈజీగా పోవడానికి గతంలో కల్వర్టులు ఉండేవి. కానీ ఆధునీకరణ పేరుతో ఆ కల్వర్టులను మూసివేశారు. నిజానికి కలెక్టరేట్నిర్మించిన ప్రాంతం ఒకప్పుడు చెరువు. దీనిని దృష్టిలో ఉంచుకునే కల్వర్టులు, తూములు ఏర్పాటు చేయగా.. వాటిని మూసేయడంతో నీళ్లన్నీ నిలిచిపోయాయి.
పూడిక కూడా తియ్యలే...
వానకు కరీంనగర్ నుంచి సిరిసిల్ల మధ్య రోడ్డు జలమయం కావడంతో రాంనగర్, పద్మానగర్ ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించింది. ఇక అశోక్ నగర్, గణేష్ నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. మున్సిపల్ అధికారులు నీటిని మళ్లించడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్లానింగ్ లేకుండా రోడ్లను నిర్మించడంతో పాటు డ్రైనేజీల్లో పూడికతీత పనులు పూర్తి చేయకపోవడమూ తాజా పరిస్థితికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రోడ్ల నిర్మాణాల్లో ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి తూములు ఏర్పాటు చేయడంతో పాటు డ్రైనేజీల్లో పూడికతీత తీయాలని జనం కోరుతున్నారు.
ప్లానింగ్ లేకుండా రోడ్లు..
స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన రోడ్లను ప్లానింగ్ లేకుండా నిర్మించారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్మించిన, ఇంకా నిర్మాణంలో ఉన్న రోడ్లన్నీ అట్లనే ఉన్నాయని జనం అంటున్నారు. ఇంతకుముందు రోడ్ల మీద ఎక్కడా నీళ్లు ఆగిన సందర్భాలు లేవని, కానీ కొత్తగా నిర్మించిన రోడ్లపై నీళ్లు నిలుస్తున్నాయని మండిపడుతున్నారు. దీనిపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇటీవల కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. రోడ్లపై నిలిచే వరద డ్రెయిన్లలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన తూములు.. చాలా చోట్ల రోడ్ల కంటే ఎత్తులో ఉన్నాయి. దీంతో మెయిన్‌రోడ్ల మీది వరద మురుగు కాలువల్లోకి వెళ్లకపోవడంతో నీళ్లన్నీ జామ్ అవుతున్నాయి. అవన్నీ సమీప కాలనీల్లోకి మళ్లుతున్నాయి. ఈ కారణంగానే పట్టణంలోని రాంనగర్, భగత్‌నగర్, ఖార్ఖానాగడ్డ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.