భద్రకాళి చెరువులో మురుగు!

భద్రకాళి చెరువులో మురుగు!
  • నేరుగా కలుస్తున్న డ్రైనేజీ వాటర్
  • అదే నీటిలో తెప్పోత్సవాలు, తీర్థ చక్ర స్నానాలు
  • పట్టించుకోని లీడర్లు, ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు: భక్తులు ఎంతో పవిత్రంగా కొలిచే ఓరుగల్లు భద్రకాళి గుడి చెరువు అపవిత్రమవుతోంది. ఒకప్పుడు ఆలయంతోపాటు నగర తాగునీటి అవసరాలను తీర్చిన చెరువు ఇప్పుడు మురుగు నీటితో నిండిపోతోంది. వివిధ పండగల సందర్భంగా నిర్వహించే తెప్పోత్సవాలు, చక్రతీర్థ స్నానాలకు ఆ నీళ్లే దిక్కవుతున్నాయి. పైనుంచి వచ్చే మురుగునీరు బయటకు వెళ్లేందుకు సరైన విధంగా నాలాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుండగా.. లీడర్లు, ఆఫీసర్లు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.  

ఉత్సవాలన్నీ ఈ చెరువులోనే..

కాకతీయుల కాలంలో నిర్మించిన ఓరుగల్లు భద్రకాళీ దేవస్థానం తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచింది. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయానికి భద్రకాళి చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, శాకాంబరి ఉత్సవాలు, వసంత నవరాత్రోత్సవాలు ఇలా వివిధ రకాల వేడుకల సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు  తీర్థ చక్ర స్నానాలు, తెప్పోత్సవాలు ఇదే చెరువులో నిర్వహించేవారు. ఆలయాన్ని శుభ్రం చేయడం నుంచి అమ్మవారి అభిషేకాల వరకూ అదే నీటిని ఉపయోగించేవారు. కానీ కాలక్రమేణా చెరువు మురుగు నీటితో నిండిపోతుండటంతో కొన్నేండ్లుగా అమ్మవారి గర్భగుడి అవసరాలు, అభిషేకాల కోసం పక్కనే ఉన్న వేద పాఠశాలలోని నీటిని వాడుతున్నారు. ఆ నీరు అన్ని అవసరాలకు సరిపోయే అవకాశం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెరువు నీటితోనే ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. భక్తులు కాళ్లు, చేతులు కడుక్కోవడం, తలపై చల్లుకోవడానికి కూడా వాటినే ఉపయోగిస్తున్నారు.

చుట్టుపక్కల నీళ్లన్నీ ఇందులోకే.. 

వరంగల్ నగరంలో నాలాల వ్యవస్థ సరిగా లేదు. ముఖ్యంగా హనుమకొండ వైపు డ్రైన్ సిస్టం సక్రమంగా లేక.. మురుగు నీళ్లన్నీ ఇష్టమొచ్చినట్టు ప్రవహిస్తున్నాయి.  హనుమకొండలోని రెవెన్యూ కాలనీ, సుర్జీత్ నగర్, దీన్​దయాల్ నగర్, ఆ చుట్టుపక్కల ఏరియాల నుంచి వచ్చే మురుగునీళ్లు పారేందుకు నాలాలు లేవు. ఆ నీళ్లన్నీ జూపార్క్ లోపలి నుంచి వికాస్ కాలేజ్, న్యూ మారుతీ హిల్స్ వైపు నుంచి భద్రకాళి నాలాలో కలవాల్సి ఉంది. కానీ ఇక్కడ నాలా పూర్తిగా లేకపోవడంతో ఆ నీళ్లను భద్రకాళి చెరువులోకి వదులుతున్నారు. అంతేకాకుండా హంటర్ రోడ్డు నుంచి అల్లూరి కాలేజ్ మీదుగా వచ్చే నాలా కూడా ఇదే తీరుగా భద్రకాళి నాలాకు బదులు, చెరువులో కలుస్తోంది. ఇలా డ్రైనేజీ వాటర్ భక్తులు పవిత్రంగా భావించే చెరువులో కలుస్తుండడంతో అది కాస్త మురికి కూపంగా మారుతోంది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు  ఇకనైనా భద్రకాళి  చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్​ చేస్తున్నారు. 

మురుగునీళ్లు చేరుతున్నయ్ 

పవిత్రంగా భావించే భద్రకాళి ఆలయ చెరువులోకి మురుగునీళ్లు చేరుతున్నాయి. ఆలయంలో వివిధ అవసరాలకు వాటినే వాడుతున్నా  ఎవరూ పట్టించుకోవడం లేదు. మురుగునీళ్లతో  భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. పాలకులు పట్టించుకుని ఇకనైనా భద్రకాళి చెరువు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. 
– ఓం నమఃశివాయ, వరంగల్

మున్సిపల్​ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి

భద్రకాళి చెరువులోకి మురుగు నీరు చేరుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. చెరువు నీరు కలుషితం కాకుండా జీడబ్ల్యూఎంసీ, ఇరిగేషన్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వారి దృష్టికి తీసుకెళ్లి భద్రకాళి చెరువు నీళ్లు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం.​ 
– అద్దంకి విజయ్, సూపరింటెండెంట్, భద్రకాళి దేవాలయం