సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

 సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ముర్ము గ్రాడ్యుయేట్స్ గౌరవ వందనం స్వీకరించారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో పాల్గొనడం తనకెంతో  సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఇలాంటి ధైర్యవంతులను కన్న తల్లిదండ్రులకు ఆమె అభినందనలు తెలిపారు. 

శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. రాబోయే రోజుల్లో విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. సిరియా, టర్కీ ప్రాంతాల్లో వచ్చిన భూకంపంలో  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని అన్నారు. కోవిడ్ లోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు. ఫైటర్ జెట్ ఫైలెట్లలో మహిళలు కూడా అధికంగా ఉండటం సంతోషదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

 ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను సుఖోయ్ 30 ఎంకేఐ ఫైట‌ర్ జెట్‌లో విహ‌రించిన‌ విషయాన్ని ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్‌లో విహరించి బ్ర‌హ్మ‌పుత్రి, తేజ్‌పూర్ లోయ‌లు, హిమాల‌యాల అద్భుతాల‌ను వీక్షించానని చెప్పారు. స‌ముద్ర మ‌ట్టానికి రెండు కిలోమీట‌ర్ల ఎత్తులో గంట‌కు 800 కిలోమీట‌ర్ల వేగంతో ఆకాశంలో విహరించడం తనకు గొప్ప అనుభూతిని మిగిల్చిన‌ట్లు ముర్ము తెలిపారు.