Dream 11: డ్రీమ్-11 కంపెనీ క్లోజ్ చేస్తున్నారా..? యూజర్లలో ఆందోళన..

Dream 11: డ్రీమ్-11 కంపెనీ క్లోజ్ చేస్తున్నారా..? యూజర్లలో ఆందోళన..

New Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం పొందటం అటు కంపెనీలనే కాదు ఇటు వినియోగదారులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలోని ప్రముఖ ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 కొత్త చట్టాలకు అనుగుణంగా తన రియల్ మనీ గేమింగ్ వ్యాపారాన్ని క్లోజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని కంపెనీ తన ఉద్యోగులకు వెల్లడించినట్లు సమాచారం.

అయితే కంపెనీ తన వ్యాపారం క్లోజ్ చేస్తుందనే వార్తలతో ప్రస్తుతం డ్రీమ్11 యూజర్లు తమ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ఎగబడుతున్నారు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదంతో రియల్ మనీ గేమ్స్ పూర్తిగా నిషేధించబడ్డాయి. దీంతో ఫాంటసీ స్పోర్ట్స్, పోకర్, రమ్మీ, బెట్టింగ్-స్టైల్ యాప్‌లు నిలిచిపోతాయనే ఆందోళనలు యూజర్లలో పెరగటంతో వారు తమ డబ్బును వాలెట్ల నుంచి వెంటనే వెనక్కి తీసుకునేందుకు హడావిడి చెందుతున్నారు. 

మరో ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ జూపీ కూడా రియల్ మనీ గేమ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉచితంగా అందుబాటులో ఉండే గేమ్స్ గతంలో మాదిరిగానే యూజర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం దేశంలో 700కి పైగా విదేశాలకు చెందిన ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు వ్యాపారాన్ని చేస్తున్నాయి. అయితే వీటిలో డబ్బును వెనక్కి తీసుకోవటానికి చాలా మంది యూపీఐ వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ఒక్కసారి యాప్స్ చట్టానికి అనుగుణంగా పనిచేయటం ఆగిపోతే తమ డబ్బు ఇరుక్కుపోతుందని యూజర్లు భావించటమే ఈ పరిస్థితులకు కారణంగా తెలుస్తోంది.

యూజర్లు ఒక్కసారిగా హడావిడి విత్ డ్రా కోసం ప్రయత్నించినప్పటికీ కంపెనీల వద్ద దానికి తగినంత స్థాయిలో నిధులు లేవని తెలుస్తోంది. అయితే ఇది బ్యాంక్ రన్ దిశగా దారితీసే అవకాశం ఉందని కూడా నిపుణులు అంటున్నారు. బ్యాంక్ రన్ అంటే పెద్ద సంఖ్యలో కస్టమర్లు అకస్మాత్తుగా ఒకేసారి తమ డబ్బును ఉపసంహరించుకోవడం ప్రారంభించటం.. కానీ దానికి తగినంత డబ్బు కంపెనీల వద్ద ఉండదు.