6.46 కిలోల గోల్డ్ స్మగ్లింగ్.. శంషాబాద్ లో సీజ్

6.46 కిలోల గోల్డ్ స్మగ్లింగ్.. శంషాబాద్ లో సీజ్
  • శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీజ్​
  • బంగారం విలువ రూ.2.17 కోట్లు
  • 14 మందిని అరెస్టు
  • క్యారియర్లుగా ఓల్డ్ సిటీ పేదలు
  • ఉమ్రా టూర్, కమీషన్ల పేరుతో వల

హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం తెల్లవారుజామున సౌదీ ఎయిర్ లైన్స్ (ఎస్.వి.744)లో వచ్చిన 14 మంది సభ్యుల గోల్డ్ స్మగ్లింగ్ ముఠా నుంచి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 6.46 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ విలువ 2 కోట్ల పైనే ఉంటుందని చెప్పారు. కేసు వివరాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) అదనపు డైరెక్టర్ డీపీ నాయుడు తెలిపారు.

పక్కా సమాచారంతో..

సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో భారీగా బంగారం స్మగ్లింగ్ అవుతోందని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఉమ్రా నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారా హైదరాబాద్ కు బంగారం అక్రమంగా రవాణా అవుతోందని తెలిసింది. దీంతో పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డీఆర్ఐ అధికారులను అలర్ట్ చేశారు. జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీలు చేశారు. సోదాల్లో 14 మంది వద్ద 6.46 కిలోల బంగారు బిస్కెట్లు, గొలుసులను గుర్తించారు. ఇందులో ఫారెన్ మార్క్ తో ఉన్న 24 క్యారెట్ల బిస్కెట్లు 16,  ఐదు చైన్లు, మూడు గాజులు ఉన్నాయి. వీటి విలువ రూ.2.17 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

పాత బస్తీ పేదలతో..

డీఆర్ఐ అధికారుల విచారణలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. స్మగ్లర్లు పాత బస్తీలోని పేదవారినే గోల్డ్ క్యారియర్లుగా వాడుతున్నట్టు గుర్తించారు. వారి ద్వారా యూఏఈతో పాటు సింగపూర్, మలేసియా లాంటి దేశాల నుంచి బంగారం రవాణా అవుతున్నట్లు తేలింది. ఏజెంట్లు అదే తరహాలో ఓల్డ్ సిటీలోని మరికొంతమంది పేదలను టార్గెట్ చేసినట్లు గుర్తించారు. విమాన టికెట్లలో డిస్కౌంట్స్ పేరుతో టార్గెట్ చేసిన వారిని జెడ్డా, ఉమ్రా ట్రిప్ పంపిస్తున్నారు. అలా వెళ్లిన వారికి డబ్బు ఆశ చూపుతున్నారు. అరబ్ దేశాల నుంచి గోల్డ్ తీసుకొస్తే కమిషన్స్ ఇస్తామంటున్నారు. ఇలా సౌదీ ఏజెంట్లతో కలిసి ఉమ్రా వెళ్లిన ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా గోల్డ్ బిస్కెట్లను అక్రమ రవాణా చేస్తున్నారు. ఎయిర్ పోర్టుకు చేరుకోగానే రిసీవ్ చేసుకునేందుకు కొందరు వ్యక్తులను నియమించుకుంటున్నారు.