
ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలోని నివసించే వాహన యజమానులకు గుడ్ న్యూస్. పాత వాహనాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పదేళ్ల పైబడిన పాత డీజిల్ వాహనాలు,పదిహేనేళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలపై ఎటువంటి శిక్షార్హమైన చర్యలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అటువంటి వాహనాలపై బలవంతపు చర్యలు తీసుకోవడం జరగదని కూడా కోర్టు పేర్కొంది.
పాత డీజిల్ పెట్రోల్ వాహనాలకు రద్దు చేస్తూ తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయి నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పందించాని కోరింది. ఈ గడువు తర్వాత కేసును తిరిగి విచారణకు చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఈ తీర్పు వేల మంది వాహన యజమానులకు పెద్ద ఊరటనిచ్చింది.
నో ఫ్యూయెల్ ఫర్ ఓల్డ్ వెహికల్స్ పాలసీ నిలిపివేత
జూలై ప్రారంభంలో ఢిల్లీ సీఎం రేఖ గుప్తా ప్రభుత్వం నో ఫ్యూయెల్ ఫర్ ఓల్డ్ వెహికల్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. పాత వాహనాలకు ఇంధన సరఫరాను నిలిపివేయడం ద్వారా కాలుష్యాన్ని అరికట్టడం ఈ చర్య లక్ష్యం. అయితే ఈ చర్యతో ప్రజా వ్యతిరేకత రావడంతో ప్రకటించిన రెండు రోజులకే నిలిపివేశారు. లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొంటున్నామని, నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని ప్రభుత్వం తెలిపింది.
అయితే నవంబర్ 1 నుంచి ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా పాత వాహనాలకు ఇంధనం నింపడంపై నిషేధాన్ని అమలు చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఆదేశించింది. ఈ ప్రాంతంలో గాలి నాణ్యత మెరుగుపడాలంటే పాత వాహనాలపై ఆంక్షలు తప్పనిసరి అని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో సవాల్..
ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఆంక్షలకు శాస్త్రీయ ఆధారం లేదని వాదించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 10 ఏళ్ల డీజిల్,15 ఏళ్ల పెట్రోల్ వాహనాలపై నిషేధాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన ఉత్తర్వును సమీక్షించాలని కూడా దాని పిటిషన్ కోరింది.
ఈ నిషేధం2015 నాటివి. 2015లో పాత వాహనాలపై నిషేధం ప్రారంభమైంది, పెరుగుతున్న కాలుష్య స్థాయిలను ఎదుర్కోవడానికి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పాత వాహనాలను నడపకుండా నిషేధించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఉత్తర్వును 2018లో సుప్రీంకోర్టు సమర్థించింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వేలాది మంది వాహన యజమానులకు తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఈ వివాదంపై తుది నిర్ణయం కోసం ప్రభుత్వాల స్పందన తర్వాత సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది.