ICC T20 Rankings: తెలుగోడి తడాఖా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి తిలక్ వర్మ

ICC T20 Rankings: తెలుగోడి తడాఖా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి తిలక్ వర్మ

టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. ఆరు నెలలుగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడకపోయినా ఒక స్థానం ఎగబాకి రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో తిలక్ వర్మ చివరిసారిగా టీ20 మ్యాచ్‌ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో విఫలం కావడంతో ఈ ఆసీస్ బ్యాటర్ నాలుగో స్థానానికి పడిపోగా.. మూడో స్థానంలో ఉన్న తిలక్ వర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు. 

ALSO READ| DPL 2025: లీగ్ మారినా బుద్ధి మారలేదు: హర్షిత్ రానా అనవసర దూకుడు.. ఓవరాక్షన్‌కు ఫైన్

హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ గత ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 33, 20 స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆ తర్వాత వరుసగా రెండు సెంచరీలు బాది ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. సఫారీలతో జరిగిన 4 మ్యాచ్‌ల్లో టీ 20 సిరీస్ 198 స్ట్రైక్‌రేట్‌తో 280 పరుగులు చేయడం విశేషం. ఈ సిరీస్ లోని అద్భుతమైన ప్రదర్శన అతన్ని టాప్ 10లోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లోనూ తిలక్ నిలకడగా రాణించాడు. తన ప్రదర్శనతో టీమిండియాలో స్థానం పదిలం చేసుకున్న తిలక్.. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో జరగబోయే ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్నాడు.  

టీ20 ర్యాంకింగ్స్ విషయానికి వస్తే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. నాలుగో ర్యాంక్ లో ఉన్న సాల్ట్ మూడో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆరో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్ ల్లో సత్తా చాటిన ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు టిమ్ డేవిడ్ టాప్ 10లో చోటు సంపాదించాడు. 6 స్థానాలు ఎగబాకి పదో స్థానంలో చోటు సంపాదించాడు. 101 ర్యాంక్ లో ఉన్న సౌతాఫ్రికా యువ బ్యాటర్ బ్రెవిస్ ఏకంగా 80 స్థానాలు ఎగబాకి 21 ర్యాంక్ కు చేరుకోవడం హైలెట్ గా నిలిచింది.