DPL 2025: లీగ్ మారినా బుద్ధి మారలేదు: హర్షిత్ రానా అనవసర దూకుడు.. ఓవరాక్షన్‌కు ఫైన్

DPL 2025: లీగ్ మారినా బుద్ధి మారలేదు: హర్షిత్ రానా అనవసర దూకుడు.. ఓవరాక్షన్‌కు ఫైన్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా తన పెర్ఫార్మెన్స్ కంటే ఆటిట్యూడ్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఐపీఎల్ 2024లో మయాంక్ అగర్వాల్ ను ఔట్ చేసిన తర్వాత ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి పెవిలియన్ కు దారి చూపించాడు. ఆ తర్వాత కూడా తన అనవసర దూకుడుతో కొన్ని విమర్శలను మూట గట్టుకున్నాడు. లీగ్ ఏదైనా హర్షిత్ రానా ఆటిట్యూడ్ మాత్రం మారట్లేదు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో తన ఓవరాక్షన్ తో ఈ టీమిండియా పేసర్ చర్చ నీయాంశంగా మారాడు. ప్రత్యర్థి బ్యాటర్ ను ఔట్ చేసి పెవిలియన్ వైపుకు వెళ్ళు అని వేలు చూపించాడు.  

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మంగళవారం (ఆగస్టు 12) నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో  వెస్ట్ ఢిల్లీ లయన్స్ బ్యాటర్ ఆయుష్ దోసేజాను హర్షిత్ రానా ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఒక చక్కటి బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఔటైన తర్వాత దూకుడుగా సెలెబ్రేషన్ చేసుకున్నాడు. దోసేజా వైపు సీరియస్ గా చూస్తూ వేలు చూపించాడు. ఆర్టికల్ 2.5 కింద లెవల్ 1 నేరాన్ని హర్షిత్ రాణా చేసినట్టు హర్షిత్ రానా అంగీకరించాడు. ఇదే మ్యాచ్ లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బ్యాటర్ యాజస్ శర్మ, వెస్ట్ ఢిల్లీ లయన్స్ బ్యాటర్ క్రిష్ యాదవ్ స్టంప్ మైక్‌లో అసభ్యకరమైన మాటలు మాట్లాడినందుకు పనిష్ మెంట్ ఇచ్చారు. 

ALSO READ : బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో క్రికెట్ సురేష్ రైనా

ఈ మ్యాచ్ విషయానికి వస్తే వెస్ట్ ఢిల్లీ లయన్స్ పై నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సార్థక్ రాజన్ 33 బంతుల్లో 42 పరుగులు, అర్జున్ రాప్రియా 22 బంతుల్లో 40 పరుగులు చేసి రాణించారు. ఛేజింగ్ లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితమైంది. హృతిక్ షోకీన్ 24 బంతుల్లో 51 పరుగులు చేసిన వీరోచిత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.