Perplexity AI: మీరు ఒకే అంటే చెప్పండి.. రూ.3 లక్షల కోట్లతో గూగుల్ క్రోమ్ కొంటాం..!

Perplexity AI: మీరు ఒకే అంటే చెప్పండి.. రూ.3 లక్షల కోట్లతో గూగుల్ క్రోమ్ కొంటాం..!

Perplexity AI: ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఏఐ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐతో పోటీ పడేందుకు ప్రఖ్యాత ఏఐ సంస్థ పెర్ప్లెక్సిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ స్టార్టప్ కంపెనీ ఏకంగా గూగుల్ సంస్థ బ్రౌజర్ అయిన గూగుల్ క్రోమ్ కొనేందుకు ఆసక్తి చూపిస్తోంది. ప్రస్తుతం కంపెనీ విలువ కంటే ఇది చాలా ఎక్కువ అయినప్పటికీ.. మెుత్తం క్యాష్ పేమెంట్ చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పెర్ప్లెక్సిటీ చేసిన ప్రకటన మెుత్తం టెక్ ప్రపంచాన్నే కుదిపేస్తోంది. 

పెర్ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ గూగుల్ క్రోమ్ కొనుగోలుకు 34.5 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల్లో దీని విలువ దాదాపు రూ.2లక్షల 90వేల కోట్లు ఆఫర్ చేయటం గమనార్హం. వాస్తవానికి గూగుల్ తన క్రోమ్ విభాగాన్ని అమ్మకానికి పెట్టనప్పటికీ ఏఐ సంస్థ ఆసక్తి చూపుతూ రేటు ప్రకటించటం పెద్ద ఏఐ యుద్ధానికి భవిష్యత్తు అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ALSO READ : చైనాలో చికెన్ గున్యా కొత్త వైరస్

ఇప్పుడే కొనుగోలుకు ప్రయత్నం ఎందుకు..?
వాస్తవానికి గూగుల్ సంస్థ తన బ్రౌజర్ గూగుల్ క్లోమ్ అలాగే గూగుల్ యాడ్స్ విషయంలో అమెరికాలో యాంటీ ట్రస్ట్ కేసులను ఎదుర్కొంటోంది. ఈ రంగాల్లో కంపెనీ ఏకచత్రాధిపత్యాన్ని  కలిగి ఉందంటూ అక్కడి కోర్టులు కూడా తప్పుపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీని నుంచి కంపెనీ బయటపడటానికి క్రోమ్ ని అమ్మేయటం ఒక ఉత్తమ ప్రణాళిక అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే గూగుల్ మాత్రం తన క్రోమ్ అమ్మకానికి ఆసక్తిగా లేదు. న్యాయపోరాటానికి సిద్ధంగా ఉంది.

అయితే పెర్ప్లెక్సిటీ మాత్రం గూగుల్ క్రోమ్ కొనుగోలుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. క్రోమ్ కొనుగోలు ద్వారా ఒకేసారి 300 కోట్ల మంది కస్టమర్లను సంపాదించొచ్చని చూస్తోంది. దీంతో ప్రత్యర్థి ఓపెన్ ఏఐని మించి వేగంగా విస్తరించటానికి వీలు కలుగుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలోనే పెర్ప్లెక్సిటీ ఇటీవల భారతదేశంలోని టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ సంస్థతో ఒప్పందం ద్వారా కోట్ల మంది యూజర్లు తమ ఏఐ సేవలను ఉచితంగా ఉపయోగించుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. అయితే గూగుల్ తన ఏఐ ప్రణాళికలకు తన క్రోమ్ బ్రౌజర్ కేంద్రంగా మార్చుకుని ముందుకెళుతున్న క్రమంలో దానిని అస్సలు అమ్మబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు.