మహిళా ఆఫీసర్ హత్య.. వీడిన మిస్టరీ..మాజీ డ్రైవరే హంతకుడు

 మహిళా ఆఫీసర్ హత్య..  వీడిన మిస్టరీ..మాజీ డ్రైవరే హంతకుడు

కర్ణాటకలో దారుణ హత్యకు గురైన మహిళా ఆఫీసర్  ప్రతిమ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిమను ఆమె మాజీ డ్రైవర్ కిరణ్‌ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఓ వారం రోజుల క్రితం  కిరణ్‌ను ప్రతిమ పనిలో నుండి తీసేశారు.  దీంతో ఆమెపై పగ పెంచుకున్న కిరణ్‌ ఇంట్లో ఎవరూ లేని టైమ్  చూసి ప్రతిమను హత్య చేశాడని,  బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర్‌కు పారిపోయాడని బెంగళూరు పోలీసు కమిషనర్ బి దయానంద్ తెలిపారు.

నలభై ఐదేండ్ల ప్రతిమ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం డ్యూటీ ముగిశాక డ్రైవర్ ఆమెను కారులో ఇంటివద్ద డ్రాప్ చేసి వెళ్లాడు. అప్పటికే ఆమె భర్త, కొడుకుతో కలిసి సొంతూరైన శివమొగ్గలోని తీర్ధహళ్లికి వెళ్లడంతో ప్రతిమ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఆ సమయం లోనే  దుండగుడు ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. 

ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేసినా ప్రతిమ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె అన్నయ్య ఆదివారం ఉదయం ఇంటికి వెళ్లారు. ప్రతిమ రక్తపుమడుగులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమి చ్చారు. పోలీసులు స్పాట్లను పరిశీలించి, దర్యాప్తు కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందుతుడిని పట్టుకున్నారు.

అధికారుల కీలక సమాచారాన్ని, కదలికలను కిరణ్‌ లీక్ చేస్తున్నాడని తెలియడంతో ప్రతిమ అతన్ని తొలగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రతిమపై పగ పెంచుకుని ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిమ తన ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తుందని తెలుసుకుని, శనివారం రాత్రి ఆమె ఫ్లాట్‌లోకి చొరబడి ప్రతిమ గొంతుకోసి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.