మాస్కో ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఎటాక్.. భారత ఎంపీల బృందానికి తప్పిన ప్రమాదం

మాస్కో ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఎటాక్.. భారత ఎంపీల బృందానికి తప్పిన ప్రమాదం

మాస్కో: ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు రష్యాకు వెళ్లిన భారత ఎంపీల బృందానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎంపీల బృందం ప్రయాణిస్తోన్న విమానం ల్యాండ్ కావాల్సిన మాస్కోలోని డొమోడెడోవో అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. కాసేపట్లో భారత ఎంపీల బృందం ల్యాండ్ అవుతుందనగా ఈ దాడి జరిగింది. దీంతో భారత ఎంపీలు ప్రయాణిస్తోన్న విమానానికి ల్యాండింగ్ క్లియరెన్స్ రాకపోవడంతో ఫ్లైట్ గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. పరిస్థితి కంట్రోల్‎లోకి వచ్చాక అధికారులు పర్మిషన్ ఇవ్వడంతో భారత ఎంపీల బృందం సేఫ్‎గా ల్యాండ్ అయ్యింది. 

అసలేం జరిగిందంటే.. పహల్గాం టెర్రరిస్టు ఎటాక్‎కు కౌంటర్‎గా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సిందూర్‎పై ప్రపంచదేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపుతోంది. ఇందులో భాగంగానే డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని ఎంపీల బృందం గురువారం (మే 22) రష్యాకు బయలుదేరింది. ఈ క్రమంలో కనిమొళి టీమ్ ప్రయాణిస్తోన్న విమానం ల్యాండ్ కావడానికి నిమిషాల ముందే మాస్కోలోని డొమోడెడోవో అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది.

వెంటనే అప్రమత్తమైన అధికారులు మాస్కో ఎయిర్ పోర్టును క్లోజ్ చేశారు. దీంతో విమానాశ్రయంలో దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. భారత ఎంపీల బృందం ప్రయాణిస్తోన్న విమానానికి కూడా ల్యాండ్ కావడానికి ఆటంకం ఏర్పడింది. ఫ్లైట్ ల్యాండింగ్‎కు ఎయిర్ పోర్టు నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో చాలా సేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. 

ఎట్టకేలకు ఎయిర్ పోర్టు అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో భారత ప్రతినిధుల బృందం ప్రయాణిస్తోన్న విమానం చివరకు సేఫ్‎గా ల్యాండ్ అయ్యింది. రష్యాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు అఖిలపక్ష ఎంపీల ప్రతినిధి బృందానికి విమానాశ్రయంలో స్వాగతం పలికి.. వారిని సురక్షితంగా హోటల్‌కు తీసుకెళ్లారు. భారత ప్రతినిధుల బృందం ల్యాండ్ కావడానికి కొంచెం ముందే ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడి ఇండియా ఎంపీలకు ప్రమాదం తప్పినట్టైంది.